Saturday 13 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (200)



మనిషే సమర్థుడని అతడన్ని పనులు చేయగలడని భావిస్తాం. మనమెట్లా ఈ ప్రపంచంలో ఉన్నామో అట్లాగే ఒక జంతువు అడవి నుండి నగరానికి వచ్చి వింతగా చూస్తోంది. ఇట్లా ఉందేమిటని అదీ ఆశ్చర్య పడుతోంది. అట్లా దానినుంచడానికి మనవంటి సమర్థుడొకడుండాలి. 


గులాబీ పువ్వుల క్రమ వికాసానికి ఏ ధర్మం పనిచేస్తోందో అచలంగా పర్వతాలుండడానికి, గ్రహగతులకూ ఏదో ఒక ధర్మం ఉండనే ఉంది. ప్రపంచం అంతా కార్య కారణ సంబంధంతో ఉంది. విడిగా ఉన్నట్లు కనబడినా బంధించే ఒక సూత్రముంది. ప్రకృతి తన నియమం తప్పకుండా ఉండడానికి ఏదో ఒక మహత్తరమైన బుద్ధి ఉండాలి. బుద్ధిలేకుండా ఏ పని, ఎవ్వడూ చేయడు.


తాను సమర్థుడనని మానవుడు భావించినట్లుగానే మన కంటే పెద్ద సమర్థుడుందాలని, ఒక దయామూర్తి ఉండాలని భావించడంలో తప్పేముంది? సృష్టించడాన్ని, పాలించడాన్ని యాంత్రికంగా నిర్వహిస్తున్నాడా? దయతో నిర్వహిస్తున్నాడు. అతడిచ్చిన శక్తి సామర్థ్యాలతో అట్టి అనంత శక్తిమంతుని ప్రార్ధించడం సబబుగా ఉండదా?


అతడే భగవానుడు, మనకున్న శక్తి నిచ్చువాడతడే. అడుగు జాడలను బట్టుకొని దొంగను వెదకునట్లుగా ఈ కనబడే ప్రకృతిని చూసి దీని కారకుణ్ణి అన్వేషించగలగాలి. మనం అడుగులు వేయడానికి గల శక్తినీ అతడిచ్చాడు. అట్టి మనకున్న శక్తియే ఒక అడుగువేయుట.


అరచేతిని చూడండి. పుట్టినప్పటినుండి గిట్టేవరకు గీతలుంటాయి. అతడు గీసినట్లు మనం గీయగలమా? ఒక ఆకునకు ఎన్ని ఈనెలుంటాయో! అవీ ఒక క్రమపద్ధతిలో ఉంటాయి. అందరి శక్తియుక్తులకు మించిన శక్తితో ఎంతో ఆశ్చర్యాన్ని కల్గిస్తున్నాడు. ఆ గొప్ప దొంగ మనకు తెలియకుండా ఎన్నో పనులు చేసాడు. ఆ గజదొంగ, కనబడడు. ఒక గుహలో దాగియుంటాడని వేదాలు కీర్తిస్తున్నాయి. అదే హృదయగుహ, మనలో దాగియుండి మనకు తెలియకుండా ఎన్నో వింత పనులు చేస్తున్నాడు. ఎవరని తహతహయే భక్తి, తేరిపార చూస్తాం, వెదుకుతాం, కాని కనబడడు.


No comments:

Post a Comment