Thursday, 18 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (205)



ఈ విషయం ప్రక్కన ఉంచుదాం. ప్రాథమిక దశలో కర్మను చేసే వాణ్ణి ప్రేమిస్తాడా? పూజచేసే వాణ్ణి భగవానుడు ప్రేమిస్తాడా? ఈ ప్రశ్న వేయండి. ఒక ధనవంతుని దగ్గర ఇద్దరు సేవకులున్నారు. ఒక సేవకుడు పనులు చేయకుండా యజమానిని స్తోత్రం చేస్తూ ఉంటాడు. మరొకడు యజమాని చూస్తున్నాడా? లేదా అనే భావన లేకుండా తనకప్పగించిన పనిని చేసికొని పోతూ ఉంటాడు. యజమాని మూర్ఖుడైతే స్తోత్రం చేసేవాణ్ణి మెచ్చుకొంటాడు. అతడు తెలివైన వాడైతే తన కప్పగించిన పనులు చేసేవాణ్ణి మెచ్చుకొంటాడు. అయితే భగవానుడు మూర్ఖుడైన యజమాని కాదు. కేవలం భజనలు చేసేవాణ్ణే చేరదీస్తాడని భావించకండి. కర్మ చేసేవాణ్ణి ఆదరిస్తాడు. అయితే భక్తిలేని శుష్క కర్మ చేసేవాడు, అతని ప్రీతికి పాత్రుడు కాలేడు. ఈ కర్మ చేసే వానికీ పూర్తి తృప్తి కలగదు.


చేసే పని సక్రమంగా ఉండాలి. ఈ విశ్వం భగవానునిచే సృష్టింపబడింది. అందరూ అతని సేవకులే. అందరికీ ఆయన ప్రభువే. అంతేకాదు బ్రహ్మాండాలలో ఉన్న జీవులు ఏకోదరులవంటివారు. అతడు ప్రభువే కాకుండా మన తల్లి, తండ్రి కూడా. కనుక అందరూ అతని సంతానమే. వేదధర్మం ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మాన్ని విధించింది. దానికి తగ్గట్లు మన పని మనం నిర్వహిద్దాం. పరస్పరం ప్రేమతో, ఐకమత్యంతో ఉందాం. చేయవలసిన వాటిని కర్తవ్యంగా భావిద్దాం. ప్రపంచ కుటుంబానికి ఎట్టి విఘాతం లేకుండా ప్రవర్తిద్దాం. అట్టి భావనతో మనం ఉండగలిగితే పరమేశ్వరుని పట్ల భక్తి కల్గుతుంది. ప్రేమతో, భక్తితో కర్మ, మిళితమైతే అతని దయకు పాత్రులమౌతాము. ఆ స్థాయి వచ్చేవరకూ కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో కొనసాగించాలి. ఆ స్థితికి చేరుకొన్న తరువాత ఇక విడిగా పూజ, భజనలలో మునగవచ్చు.


No comments:

Post a Comment