Wednesday, 17 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (204)



కర్మ - భక్తులు


ఆదిశంకరులు, కొద్ది క్షణాలలో ముక్తిని పొందుతారని తెలియగా, కొంతమంది శిష్యులు వారిని సమీపించి ఆచార్యా మీరెన్నో శాస్త్ర విషయాలను విశదీకరించారు. కాని మేము సులభంగా, సూటిగా ముక్తిని పొందే మార్గాన్ని ఉపదేశించందని శిష్యులు ప్రార్ధించారు. ఐదు శ్లోకాలలో వారు దానిని వివరించారు.


దీనినే సోపాన పంచకమని అంటారు. వేదంలో చెప్పిన కర్మలను అనుష్టించండి, వాటిని ఈశ్వర పూజగా భావించి ఆచరించండి. కోరికల వలలో బడి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకుండా మీమీ ఆశ్రమ ధర్మాలను ఆచరిస్తే ప్రపంచానికి మంచి కల్గుతుందని ఉపదేశించారు.


ఇప్పటికే వేదంలో చెప్పబడిన వాటిని తు చ. తప్పక పాటించే వారున్నారు. ఇక చాలా మంది పూజ, ఉత్సవాలు, భజనలు చేస్తున్నారు. ఎవరైనా కర్మానుష్ఠానం చేస్తే పాటించాలి అని గేలి చేసేవారూ ఉన్నారు. వీళ్లు చేసే పనులలో శ్రద్ధలేదు, గంటలు వాయిస్తూ, తాళాలు మ్రోగిస్తూ, భజనలు చేస్తే సరిపోతుందా అని కర్మానుష్ఠానపరులు భక్తులనుద్దేశించి గేలిచేస్తూ ఉంటారు. 


సోపాన పంచకంలో కర్మను, ఈశ్వర ప్రీతికోసం చేయాలన్నారు. కర్మ చేయాలి, ఈశ్వరుణ్ణి మరువకూడదని సారాంశం. ఈశ్వరార్పణ బుద్ధియనుట ప్రధానం. ఇది ఉత్తమ తరగతికి చెందింది. సంగ రహితమైన కర్మానుష్ఠానం సామాన్యులకు సాధ్యం కాదు. కర్మ ఫలాలను విడిచిపెట్టి కర్మ చేస్తే అదే కర్మయోగం. సామాన్యులు పనులు చేస్తూ ఉన్నపుడు భగవానుని స్మరించడం తక్కువగా ఉంటుంది. అందువల్ల కర్మ విడిగా, భక్తి విడిగా నని తలుస్తూ ఉంటారు. పోనీ, అట్లా అవి విడిగా ఉన్నాయని భావించినా కొంత కాలానికి ఈశ్వరార్పణ బుద్ధి ఏర్పడుతుంది. లేదా పూజ చేయడమే కర్మగా మారవచ్చు లేదా కర్మ, పూజ మాని వేసి, చివరగా బ్రహ్మానందాన్ని అనుభవించే దశ వస్తుంది.


No comments:

Post a Comment