కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (213)
ఆలయాలలో పూజ
ఎవరైనా సాయం చేస్తే కృతజ్ఞత చెప్పడం మనవంతు. అట్లా ధన్యవాదాలందిస్తూ ఉంటాం. ఒక గడ్డి పరకను సృష్టించలేని మనకు, కూడు, గుడ్డ, నీడనిచ్చినవానికి కృతజ్ఞత చెప్పకపోతే ఎలా? అందుకే మనం అన్నం వండుకొన్న తర్వాత అతనికి నివేదించి నైవేద్యంగా సమర్పించి భుజిస్తూ ఉంటాం. అట్లాగే వస్త్రాభరణాలను స్వామికి సమర్పిస్తున్నాం. వాటిని ధరిస్తున్నాం. అందరూ అన్నీ సమర్పించి పూజ చేయడం కుదరదు. అందువల్ల అందరికీ ఉపయోగపడే రీతిలో ఆలయాలేర్పడ్డాయి. అందరూ తమకు తోచినది అర్పించి కృతజ్ఞతా భావాన్ని ప్రకటిస్తారు.
అంతటా వ్యాపించిన మహాశక్తిని, తమ మంత్ర శక్తి ద్వారా ఒక చోట కేంద్రీకరింపచేసారు ఋషులు. విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట చేసారు. అట్లా ఆలయ వ్యవస్థ ఏర్పడింది.
అందరూ ఇంట్లో తమశక్తి కొలదీ పూజచేసికొని ఆలయానికి రోజూ వెళ్లి మ్రొక్కుతూ ఉంటే ఆలయంలో జరిగే పూజా విధులు సక్రమంగా జరుగుతాయి. ఏదైనా దేవాలయానికి వెడుతున్నానని నేనంటే నా కోసమైనా ఆలయాన్ని శుభ్రంగా ఉంచుతారు, దీపాలు వెలిగిస్తారు, అలంకరిస్తారు, చక్కని నైవేద్యాలు పెడతారు.
మనం సూక్ష్మధర్మాలను విస్మరించాం. అన్న ప్రదాతకు సరియైన నివేదన ఉండాలి. విగ్రహాన్ని అలంకరించిన వస్త్రాలు శుభ్రంగా ఉండాలి. ఇట్టి విషయాలను మనం పట్టించుకోం. మురికి బట్టలు కట్టుకొన్న వాడీ జగత్తులో ఎవడని ప్రశ్నిస్తే ఆలయంలో దేవుడే కన్పిస్తున్నాడు. అవి శుభ్రంగా ఉంటే మన మనస్సు, శుభ్రంగా ఉంటుంది. ప్రతి రోజు ఆలయ సందర్శనం చేయాలని ఎన్నో నియమాలను విధించారు పూర్వులు, శివవిష్ణు ఆరాధన చేయాలన్నారు. ఇట్లా ప్రతి ఆలయంలోనూ నిత్యపూజలు జరుగుతున్నాయా లేదా అని చూడడం మన అందరి వంతు.
No comments:
Post a Comment