Sunday, 28 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (215)



ఆలయాల పవిత్రత


గ్రామగ్రామాన లయాలు వెలుస్తున్నాయి. జీర్ణ దేవాలయోద్ధరణ జరుగుతోంది. కుంభాభిషేకాలు సరేసరి. నా దగ్గరకు వచ్చి కొంత మంది సలహాలడుగుతూ ఉంటారు. చాలా సంతోషంగానే ఉంది.


అదే సందర్భంలో కొంతమంది వచ్చి చెప్పే విషయాలు వింటూ ఉంటే బాధ కూడ కల్గుతోంది. వాళ్లు మిగతా వాళ్లతో చెప్పుకోవడం కంటే నాతో చెప్పుకోవడంలో కొంత తృప్తిని పొందుతున్నారు. ఇతరులు సలహాలు చెప్పడానికి జంకవచ్చుగాని, నేను నిర్భయంగా కొన్ని విషయాలు చెప్పాలి కదా! ఏది శాస్త్ర విరుద్ధమో ఏది సమ్మతమో స్పష్టంగా చెప్పాలిగదా! వినండి.


ఆలయాలు ప్రశాంతంగా, పవిత్రంగా ఉండాలి. భగవత్ చింతన తప్ప ఇతర ఆలోచనలను అక్కడ రానీయకూడదు. అయితే మనం చూస్తున్నదేమిటి? అనేక ఆలయాల చుట్టు ప్రక్కల కొట్లు కట్టి వ్యాపారం సాగిస్తున్నారు. టీ, సిగరెట్టు కొట్లుంటాయి. దేవాలయానికి ఆదాయం వస్తుందని అన్నింటిని ప్రోత్సహిస్తున్నారు. ఒక్క స్వామి ఉన్న ప్రాంతం తప్ప మిగిలిన ప్రదేశమంతా అద్దెకీయబడుతోంది. అట్టి గందరగోళ పరిస్థితిలో భగవత్ భావన కనుమరుగౌతోంది. కలుషిత వాతావరణంలో భక్తి సన్నగిల్లుతుంది. 


కార్యాలయ భవనాలు, కుటీరాలు, ఫలాహార శాలలు మొదలగునవి ఎన్నో చుట్టు ప్రక్కల వెలుస్తున్నాయి. కైంకర్యానికి చెందని అనేక క్రియాకలాపాలు సాగుతున్నాయి. అభివృద్ధి పేరుతో అనాచారాన్ని ప్రోత్సహిస్తున్నారు. 


1 comment: