Thursday, 25 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (212)

అంటే ఏం జరిగింది? ఆకారంలేని, గుణాలు లేని, అనంతమైన దానిని గుణాలున్నట్లుగా భావిస్తున్నాం. నిర్గుణుడైన పరమాత్మనుండే అన్ని రూపాలూ వచ్చాయి. ఒక్కొక్క గుణానికి ఒకొక్క రూపాన్ని పెట్టి ఒక్కొక్క దేవతగా ఆరాధిస్తున్నాం. మనకర్థమయ్యే రీతిలో, మనస్థాయికి తగ్గట్లుగా ఆ పరమాత్మ తత్వం అవతరిస్తే దానిని స్వీకరిస్తున్నాం, పూజిస్తున్నాం.


మనమే రూపంలో ధ్యానించినా అతడు దయను చూపిస్తాడు. మనస్థాయిని క్రమక్రమంగా పెంచుతాడు.


చిట్ట చివర దశలో మనస్సు దాటిన స్థితిని మనస్సునకు అనుగ్రహిస్తాడు. అనగా సంకల్ప వికల్పాలు లేని స్థితిని ప్రసాదిస్తాడన్న మాట. అట్టి నిర్వికల్ప స్థితిలో పరమాత్మను నిర్వికారునిగా, నిద్క్రియునిగా, నిర్వికల్పునిగా భావించగలం. మొదటి మెట్టులో మనముండగా అతడు అతీతుడని భావిస్తాం. అందుకై అతనికి కల్యాణ గుణాలున్నట్లు, ఒక ఆకారం ఉన్నట్లు భావిస్తాం. మన మనస్సు పరిపక్వమైన కొలదీ అతని అతీత స్థితిని అర్థం చేసికొనగలం. మనస్సుకి ఏ పని లేనపుడు పచ్చని పండు పచ్చగానే కన్పడినట్లు, మనస్సు అణగినపుడు, పరమాత్మను, పరమాత్మగానే దర్శిస్తాం. మంత్ర పఠనంలో, ఆచారాలలో, పూజావిధానంలో అనేక నియమాలుంటాయి. పరమాత్మను ఒక విధంగా ఊహించుకొని పూజించినపుడంతే. ఆ ఊహ అణగిన వానికి నియమము లేదు, క్రియ కూడ లేదు. పూజ, మనస్సుతో, క్రియతో సాగుతుంది కదా! కాని మనస్సు పరిపక్వమైనపుడు జ్ఞానమే ప్రకాశిస్తుంది. పూజాదులు లేవు. ఇట్టి జ్ఞానము మనకు మొదటి దశలోనే కల్గిందని భ్రాంతి పడకూడదు. జ్ఞాన సంపాదనకై పూజను అంగంగా భావిస్తారు. మన ఊహలకు తగ్గట్లు విగ్రహాలున్నాయని భావించవద్దు. ఋషులకు ఫలానా మూర్తులని, ఫలానా మంత్రాలని, ఫలానా నియమాలని పరమాత్మయే ముందు నిర్దేశించాడు. పరమాత్మయే మూర్తి, యంత్ర, మంత్ర, తంత్ర రూపంగా అవతరించాడని భావించి ఆ మార్గం గుండా భక్తితో, అంకిత భావంతో పయనించగా పయనించగా కృపావర్షం కురిపిస్తాడు. జ్ఞానోదయం కల్గుతుంది. 


జ్ఞానం రానీ, రాకపోనీ, పూజచేస్తున్నామంటే ప్రేమతో సాగాలి. ఈ ప్రేమ, భక్తి మనకు అనంత తృప్తిని ప్రసాదిస్తాయి. దీనివల్ల అతని ప్రేమను పొందగలం, అదే గొప్ప అనందం. ఆపైన ఆతడద్వైత జ్ఞానాన్ని ప్రసాదిస్తాడో లేదో అతని ఇష్టం. అది రాలేదని బాధపడనవసరం లేదు. భక్తి అనుగ్రహం చాలు.   


No comments:

Post a Comment