ఆలయ పూజా విధానంలో నేడు రకరకాల మార్పులు చేస్తున్నారు. పవర్ హౌస్ నుండి విద్యుత్తు ఎట్లా అన్ని చోట్లకు సరఫరా అవుతుందో అంతటా వ్యాపించిన వానిని ఒక చోట కేంద్రీకరించగా అవి ఆలయాలయ్యాయి. ఆగమాల ప్రకారంగానే పూజలు జరగాలి. చేతులున్నాయని ప్రతివాడు విద్యుత్ పరికరాలను ముట్టుకుంటే ఎలా? అట్లాగే మన పరిమిత బుద్ధులనుపయోగించి మార్పులు చేసినా దుష్ఫలితమే మిగిలేది.
కొందరేమంటారంటే ఆలయంలో అర్చకుడు సరిగా లేడంటారు. అయినా ఆలయ పవిత్రతకు భంగం లేని రీతిలో మనమెందుకు నియమాలను మార్చకూడదని ప్రశ్నిస్తారు. వీళ్ల వల్ల స్వామియే గెంటివేయబడుతున్నాడు. ఆచారం కొంతలేకపోయినా ఆలయం వెంటనే పవిత్రతను కోల్పోదు. కాని ప్రతివాడు, కలుగచేసికొని అనాచారాన్ని వ్యాప్తి చేస్తే నష్టబోయేది మనమే. భగవంతునికి నష్టం లేదు. కనుక ఆగమాస్త్రాలు విధించని వాటిని క్రొత్తగా ప్రవేశపెట్టవద్దు. మనం అందరం ఆచారాలకు కట్టుబడి భక్తిశ్రద్ధలతో ఆలయాలకు వెడుతూ ఉంటే మనలను చూసైనా పూజారి తన దోషాలను సరిదిద్దుకొంటాడు.
రాజకీయ నాయకులు చీటికీ మాటికీ మత విషయాలలో తలదూర్చడం మంచిది కాదు. మనం క్రొత్తగా ప్రవేశపెట్టేది స్థిరంగా ఉంటుందని చెప్పగలమా! నదులు పొంగిపొర్లేటప్పుడు ఒడ్లకు కొంత చేటువస్తుంది. అది వర్షకాలంలో సహజం. దానికై చింతించనవసరం లేదు.
క్రొత్త క్రొత్తగా వచ్చే తిరుగుబాటు భావాలు కలవారిని ఒప్పించవచ్చు. సంఘ సంస్కర్తలు ప్రాచీన శాస్త్రాలను చదవరు. అందువల్ల కొన్ని సందర్భాలలో కోపోద్రిక్తులౌతారు. వారిని చూసినపుడు కోపగించరాదు. ప్రతిపక్షాన్ని గౌరవించడమే మనవంతు. శాస్త్రీయమైన ఆచారాలను ప్రేమతో విశదీకరించాలి.
కొన్ని వందల సంవత్సరాల వెనుక రాజులచే ఇవి పోషింపబడ్డాయి. ముందు మన నడవడిక తిన్నగా ఉంటే భక్తి శ్రద్ధలుంటే ఎదురు తిరుగు భావాలు కలవారిని ఒప్పించవచ్చు.
No comments:
Post a Comment