మన దేహ, మానసిక శక్తులనుపయోగించి ఒక ఇంటిని కట్టాం. తన కున్న శక్తితో పిచ్చుక గూడు కట్టింది. అట్టి అనంతశక్తులనుపయోగించే స్వామి, ఈ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు. ఒక ప్రాణికి, మరొక ప్రాణికి శక్తులలో తేడాలున్నాయి. చిట్టచివరకు వెడితే అనంతశక్తి కలవాడొకడున్నాడని ఊహిస్తాం.
ప్రకృతిలో విరుద్ధమైన జంటలుంటాయి. చలి-ఎండ; రాత్రి-పగలు; మెత్తనిపువ్వులు - గ్రుచ్చుకొనే ముళ్లు; తీపి-చేదు; ప్రేమ-పగ; ఇట్లా పరస్పర విరుద్ధంగా ప్రకృతి సాగుతోంది. ఇట్లా ఆలోచిస్తూ ఉంటే మన మనస్సునకు విరుద్ధమైనది ఒకటుండవద్దా? మానవ మనస్సు ఏం చేస్తోంది! పిచ్చి పనులు చేసి దుఃఖపడుతోంది. తృప్తిలేదు. అసత్కార్యాలకు భిన్నంగా శాంతంగా, దుఃఖాతీతంగా, సుఖశాంతులతో కూడిన తత్వం ఒకటి ఉండాలి. అతడే స్వామి.
ప్రకృతిలో అన్ని మార్పు చెందుతూ ఉంటాయి. క్షణక్షణమూ జరుగుతుంది. సముద్రాలు, పర్వతాలలో మార్పు లేదని మనం భావిస్తాం గాని వాటిలోనూ మార్పులున్నాయి. కాలానికి అన్ని లోబడవలసిందే. ఏదీ శాశ్వతంగా ఉండదు. అది దాని ధర్మం. పై జంటలున్నట్లే శాశ్వతమైనది, అవ్యయమైనది ఒకటి ఉండాలి. అదే ఈశ్వరతత్వం.
సరే అతడున్నాడని అంగీకరిద్దాం. అయితే అతణ్ణి భజించి ఏం లాభం? మన మెప్పుడూ కోరికలతో ఉంటాం. ఆయనకు కోరికలే లేవు. మనకు పరిమిత శక్తి ఉంది. కోరికలు లేకపోయినా అధిక శక్తిమంతుడతడు.
జ్ఞానంలోనో, శక్తిలోనో గొప్ప వాడే కాదు. దయాసముద్రుడు కూడా. మనలోని అగాధాలను పూడ్చుకోవాలంటే అతని కృపావర్షం మనపై పడాలి. కోరికలు తీరాలన్నా అతడు ప్రేమామృతాన్ని వర్షించాలి. అందుకే భజన.
మనకా కోరికలు లేకపోతే మనమూ పరిపూర్ణ స్వరూపులమే. పరమాత్మ మన కోరికలను తీర్చి, ఇక కోరికలు అడుగని స్థితిని ప్రసాదిస్తాడు. మన అపూర్ణత్వాన్ని పూర్ణత్వంగా మార్చగలడు.
No comments:
Post a Comment