Monday, 29 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (216)

ఒక్కొక్క ఆలయానికి ప్రత్యేకంగా పరిపాలన పద్ధతి ఉండక అంతా ప్రభుత్వాధీనంలో ఉండడం వల్ల ప్రజలు తమ గోడును వినిపించవలసి వస్తోంది. ఏదైనా మంచి పనిని ఉద్యోగులు మొదలుపెడితే పూర్తికాకుండానే ఐదిలీలు జరుగుతున్నాయి. రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువైంది.


పవిత్రతకు ప్రాధాన్యం ఈయక పైపై కుంభాభిషేకాలు జరిగినా ఫలం శూన్యమే. భక్తులు ఈ విషయంపై దృష్టిని సారించి ఆలయం ఒక వ్యాపార స్థలంగా ఉండకుండా చూడాలి. ప్రజలలో సామూహికమైన చైతన్యం రావాలి.


అనాచారాలను పేర్కొనడం నా విధిగా భావిస్తున్నాను. ఏదో ఒక కళాశాల నుండో, పాఠశాల నుండో 50, 60 మంది విద్యార్థులు ఒక్క మారే వస్తూ ఉంటారు. అందు యుక్త వయస్సు వచ్చిన ఆడపిల్లలూ ఉంటారు. వారు నెలసరి (బహిష్టు) నియమాలను పాటించకుండా ఆలయంలో ప్రవేశిస్తూ ఉంటారు. ఇది తప్పని తెలియక వస్తూ ఉంటారు. పూర్వం ఇంట్లోనే ఆ రోజులలో దూరంగా ఉంచేవారు. వారు వచ్చినా స్వామి, మైలపడతాడా అని సంఘసంస్కర్తలు ప్రశ్నిస్తూ ఉంటారు. కొందరు స్వామి పవిత్రంగా అన్నిచోట్ల ఉంటాడని ఆలయాలకే రానవసరం లేదని వాదిస్తూ ఉంటారు. ఆలయాలు శాస్త్ర ప్రకారం నిర్మింపబడ్డాయి. నియమాలను పాటించకపోతే ఎలా? శాస్త్ర నియమాల ఉల్లంఘన వల్లనే యాత్రాస్థలాలలో ప్రమాదాలు, అనుకోని విపత్తులు సంభవిస్తున్నాయని భావిస్తున్నాను.


అంత గొప్ప క్షేత్రంలో ప్రమాదాలు జరగడమేమిటండి? స్వామి తన పవిత్రతను కోల్పోయాడా అని ప్రశిస్తూ ఉంటారు. నేను బాధపడుతూ స్వామి అక్కడ ఉన్నాడు కాబట్టే అనాచారాన్ని తట్టుకోలేక దయకలవాడైనా అప్పుడప్పుడు ప్రమాదాల రూపంలో శిక్షవేస్తున్నాడేమో అని అనిపిస్తోందని ఒకమాట అంటాను.


క్షేత్రాలు, విహారయాత్ర కేంద్రాలు కావు. భక్తి లక్ష్యమైనా పై పవిత్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు లేదు. అపచారాలతో క్షేత్రాలను నింపుతున్నాం.


ఇట్లా అనాచారాలు తెలిసి చెప్పకపోవడం నా ధర్మాన్ని విస్మరించినట్లౌతుందని చెప్పడం జరిగింది. భక్తులలో పరివర్తన తీసుకురావాలని వేంకటేశ్వరుని ప్రార్థిస్తున్నా.  


No comments:

Post a Comment