Thursday 11 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (198)



సంస్కృతం – తమిళం


ప్రాచీనమైన తొల్ కాప్పియం రచనా కాలం నుండి పూర్వులైన తమిళులు సంస్కృత వాఙ్మయాన్ని ధారాళంగా వాడుకున్నారు. ఏదైనా కొత్త పదం యొక్క అవసరం వచ్చినపుడు కృత్రిమంగా దానిని సృష్టించకుండా సంస్కృతం నుండే గ్రహించేవారు. సంస్కృతాన్ని అందరి భారతీయుల సౌత్తుగా పరిగణించేవారు. తమిళానికి పరాయి భాషగా సంస్కృతాన్ని లెక్కించలేదు.


తిరువళ్ళువర్ కంటే తమిళానికి సేవ చేసినవారు మరొకరు లేరు. ఇతని పద్యం రెండు వాక్యాలతో ఉంటుంది. అతడు వ్రాసిన కురల్ లో మొదట్లో ఆది, భగవాన్, ఉలగు అనే మాటలున్నాయి. ఉలగు అనగా ప్రపంచం. సంస్కృతంలోని లోకం అనే శబ్దాన్నుండే ఉలగు అనే పదం వచ్చింది. లోక మనగా మనచే చూడబడేది. ఆంగ్లంలోని Look కూడా దీనినుండి పుట్టిందే. చూసే ఇంద్రియం పేరు లోచనం, అదీ దాని నుండే వచ్చింది. వీటికి తమిళంలో పదాలు దొరకకపోవు. అయినా ఈ పదాలను వాడి అతని ఉదారభావాన్ని ప్రకటించాడు. మొదటి పద్యమే ఇట్లా ఉందని గ్రహించండి.


సంస్కృత బంధం నుండి విడివడాలని నేటి తమిళ సోదరులు మహోద్యమం చేస్తున్నారు. వారు కృత్రిమ పదాలను తయారు చేసినా వాటి మూలాలు సంస్కృతంలోనే కన్పిస్తాయి. ఉదా: సంస్కృతంలో మంత్రి అనే పదానికి అమైచ్చార్ అని తమిళంలో వ్రాసినా అది సంస్కృతంలోని అమాత్య పదం నుండే వచ్చింది.


అభిమానాన్ని నేయంగా మార్చారు. అది సంస్కృతంలోని స్నేహానికి వికృతి.


ఒకాయన ఒక ముఖ్య రాజకీయ నాయకునికి విజ్ఞాపన్ అని వ్రాసేడు. ఆయన కోప్పడి విన్నప్పంగా మార్చాలన్నాడు. విజ్ఞాపనం విన్నపమైంది. ప్రాకృతంలో దీనిని విన్నాప్పం అంటారు. మూలం ఒక్కటే.


ఇట్లా ఎన్నెన్నో ఉదాహరణలను పేర్కొనవచ్చు. తమిళ పదాలనే వాడాలని పట్టుబట్టేవారిని తప్పు పట్టడం లేదు. వారు భాషకు దోహదం చేస్తున్నమాట సత్యమే. అయ్యా మీరు చేస్తున్నది సంస్కృతానికి వికృతులను కల్పిస్తున్నారని మృదువుగా వారికి చెప్పాలి. ఒప్పించగలగాలి. వాగ్దేవిని వారిలో ద్వేష భావంతో లేకుండా చూడమని ప్రార్థిద్దాం. అట్లే వ్యాస భారతాన్ని వ్రాసిన వినాయకుణ్ణి, తమిళ భాషకు మూలమైన గణపతిని మమ్మల్ని అందర్నీ దీవించుమని, మాలో ద్వేషాలు లేకుండా చూడమని తమిళాన్ని, సంస్కృతాన్ని సమానంగా గౌరవించునట్లు చేయుమని ప్రార్థిద్దాం. 



No comments:

Post a Comment