Tuesday, 30 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (217)

ఆలయం - దైవకార్యాలు


రెండువేల సంవత్సరాల వెనుక మెగస్తనీసు మనదేశం వచ్చి ఆశ్చర్యపోయాడు. భారతీయులు అబద్ధమాడరని, వీథిలో డబ్బును విడిచినా ఎవ్వరూ దానిని తాకరని, న్యాయస్థానాలు లేవని ఇంకా ఏవేవో విషయాలను వ్రాసేడు. అట్లా మనం ఈనాడూ ఉండగలగాలి.


ఆనాటి సమాజం అట్లా ఉండడానికి కారణం ఏమైయుంటుంది? నేడీ పతనానికి కారణమేమిటి? ఆనాటి పవిత్ర వాతావరణం వల్లనే శీలవంతులుండేవారు. పూర్వకాలంలో ఆలయాలలో భారత ప్రవచనాలుండేవి. కథా కాలక్షేపాలు సరేసరి. ఇట్టి ప్రవచనాలు సాగడానికి ఆనాటి రాజులు కొన్ని మాన్యాల నిచ్చేవారు. ఏ నాటకం ఆడినా, ఏ కళను ప్రదర్శించినా భగవత్ సంబంధంతోనే ఉండేది. ఎవరి వృత్తులు వారు చేసికొంటూ విధిగా ఆలయాన్ని దర్శించేవారు. 


ఈనాడు మానవుల చంచల మనః ప్రవృత్తికి అనేకం దోహదం చేస్తున్నాయి. చలనచిత్రాలు, నవలలు, శృంగార కథలు, శృంగార దృశ్యాలు మనిషిని క్రుంగదీస్తున్నాయి. వాటికి తోడు రాజకీయ పార్టీలు, కక్షలు, ఎన్నికల హడావిడి ఎక్కువగా ఉంది. ఎక్కడ చూసినా అసంతృప్తి, అవినీతి తాండవిస్తోంది.


ఆనాటి కథా కాలక్షేపాలులేవు. ఏ హరికథా కాలక్షేపం చేసేవాడో వచ్చి వెళ్లిపోవడమే జరుగుతోంది! తన తరంతోనే కళ అంతరిస్తుందని బాధపడుతున్నాడు. ముందు తరాల వారికి ప్రోత్సాహం లేదని, భద్రత లేదని వాపోతున్నాడు. విద్వాంసులకే కాదు, శిల్పులు మొదలగు వారికి ఉద్యోగ భద్రత ఆనాడుండేది. జానపద కళలు క్రమక్రమంగా అంతరించిపోతున్నాయి. పొట్టగడవడమే వారికి కష్టంగా ఉంది. పొట్టకూటికై ఇతర వృత్తులను ఆశ్రయిస్తున్నారు. పిల్లలకు తమ కళలను తల్లిదండ్రులు నేర్పడం లేదు. ఆ నాటకాలు, ఆ తోలు బొమ్మలాటలు, కొయ్యబొమ్మలాటలు, ఆ హరికథా కాలక్షేపాలు, పురాణ ప్రవచనాలు ఈనాడు లేవు. ఆ శిల్ప నైపుణ్యం ఏది? జానపద కళలను ప్రోత్సహిస్తున్నామని ప్రభుత్వం ఏవో సభలు ఏర్పాటు చేయడం, మంత్రులు రావడం, ఉపన్యాసాలీయడం, ఫోటోలు పత్రికలలో ప్రచారం మొదలగు ఆర్భాటంతో ముగుస్తోంది. తరతరాలు కాపాడుకొనే భద్రతను కల్పించలేకపోతున్నారు.

No comments:

Post a Comment