Sunday 21 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (208)

ఈశ్వరుడు


జ్ఞాని, స్వస్వరూపానికి మించిన దానిని చూడడు. అనగా స్వస్వరూపాను సంధానమే చేస్తాడు. ఒకే ఒక పరమాత్మ, అనేక రూపాలుగా కన్పిస్తాడని భావిస్తాడు. బాహ్యకారాలు కనబడుటకు మాయ కారణమని, పరమాత్మ అన్నిటిలో ఉన్నాడని భావిస్తాడు. మాయా ప్రపంచంలో జ్ఞాని చేయవలసినది ఏదీ లేదు. చూచేవాడు, చూడబడేది, చూచేది, అన్నీ ఒకటైనపుడు పని ఏముంటుంది? బ్రహ్మముగానే అట్టి వాడుండి పోతాడని ఉపనిషత్తు చెప్పింది.


బ్రహ్మమునకు పని లేదు. మాయా ప్రపంచంలో చిక్కుకొని ఈశ్వరుని పూజిస్తూ తాము చేసే పనులలో సహకరించుమని భక్తులు ప్రార్ధిస్తూ ఉంటారు. మంచి పనుల కోసం తోడ్పాటు కావాలని చిత్తశుద్ధితో ప్రార్థించినప్పుడు అవి జరిగేటట్లు స్వామి అనుగ్రహిస్తాడు. ఇట్లా చూసినపుడు, పనులు లేకుండా బ్రహ్మము లేదని భావించలేం. మనం ప్రార్ధించినా, ఫ్రార్ధించకపోయినా జగన్నిర్వహణను కొనసాగిస్తూనే ఉంటాడు. అందరిని పోషిస్తూ, పాలిస్తూ ఉంటాడు. కనుక అట్టి పెద్ద పని, అతనికుంది.


అయితే పనిలేని బ్రహ్మమొకడు, పనియున్న బ్రహ్మ ఒకడూ ఉంటారా అని సందేహం. ఇద్దరూ భిన్నులు కారు. జ్ఞాని కొలిచే బ్రహ్మమే (నిరాకారమే) ఈశ్వరునిగా జగన్నిర్వాహకునిగా ఉంటాడు.


No comments:

Post a Comment