ఆకారంతో -ఆకారం లేకుండా
పువ్వు యొక్క వాసన, కన్ను గ్రహించలేదు. ముక్కుమాత్రమే గ్రహిస్తుంది. చెఱుకుగడ తీపి ముక్కునకు తెలియదు. నాల్కకే తెలుసు. సంగీతాన్ని నాల్క రుచి చూడలేదు. కేవలం చెవి మాత్రమే. చలి, వేడిని తెలుసుకొనేది చర్మం మాత్రమే. చెవులకు తెలియదు, పై నాల్గు కన్నులకు తెలియదు. కాని రంగులు చెవులకు, ముక్కు, నోరు, చర్మానికి తెలియవు. ఒక్కొక్క దానిన ఒక్కొక్క ఇంద్రియమే గ్రహిస్తుందని, అన్ని ఇంద్రియాలు అన్నిటిని గ్రహించలేవని చివరకు నాస్తికుడు కూడా అంగీకరిస్తాడు. నాల్గు ఇంద్రియాల ద్వారా వస్తువులను తెలిసికొనలేకపోయినా ఒక్క ఇంద్రియం ద్వారానైనా ఒకదాని ఉనికిని తెలిసికొంటాడు. చెవుల ద్వారా సంగీతాన్ని తెలిసికొంటున్నాం. దీనితో రుచి చూడడం, వాసన చూడడం, స్పృశించడం కుదరకపోయినా సంగీతం లేదని ఎవ్వడూ అనడు.
ఐదు ఇంద్రియాలకు అందనిది ఒకటుందని ఒక్క మాటు ఆలోచించి చూడండి. శాస్త్రజ్ఞులు, విద్యుదయస్కాంత తరంగాలున్నాయని అంటున్నారు. ఇవి విశ్వం అంతటా వ్యాపించాయని నిర్ధారించారు. కాని ఇవి ఇంద్రియగోచరాలు కావు. ఇవి విశ్వంలోనే కాదు, మన శరీరంలో మెదడులోనూ వ్యాపించాయంటే నమ్ముతున్నాం. అట్లాగే ఒక సమష్టి మనస్సు (Cosmic Mind) గొప్పదైన బుద్ధి అనగా మహత్తు ఈ ఇంద్రియాలను, వస్తువులను నిర్మించి, ఒక క్రమ పద్ధతిలో ఉంచింది. దానినే భగవానుడంటున్నాం. అది విద్యుత్తు మాదిరిగా సర్వత్ర వ్యాపించింది. అది లోపలా ఉంది. దాని నుండి ఇంద్రియాలు వెలువడి విషయాలను గ్రహిస్తున్నాయి. అదే కార్య నిర్వహణ చేస్తూ ఉంది. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క శక్తి మాత్రమే ఉంది. ఈ నియమాన్ని పరాశక్తి ఏర్పరచింది. ఇట్లా పరాశక్తి తన ఆధీనంలో వీటి నుంచింది. కానీ, ఈ ఇంద్రియాలకు లోబడి ఆ శక్తి పని చేయడం లేదు. ఇవి ఆ శక్తిని నియమించలేవు. అందువల్లనే ఆ పరాశక్తిని చూడలేకపోతున్నాం. కనబడడం లేదు కనుక ఆ పరాశక్తియే లేదని కొట్టి పారవేస్తూ ఉంటాం.
No comments:
Post a Comment