అతడన్నింటికి అతీతుడైనా భక్తులతడున్నాడని అనుభవంలో తెలిసికొంటారు. వారి ఇంద్రియాల ద్వారా కూడా తెలిసికోగలరు, మాట్లాడగలరు, చూడగలరు కూడా. తాను లేనని వాదించేవానికి తానున్నానని వచ్చి ఋజువు చేయడు. ఒక రూపం ధరించి యున్నానని చూడండని చాటింపు వేయడు. కాని భక్తునకు, రూపం లేని వాడు తానైనా రూపం ధరించి సాక్షాత్కరిస్తాడు. తీగలో ఉన్న విద్యుత్తు కంటికి కన్పిస్తోందా? అది ఒక బల్బుకు అనుసంధానం చేసినప్పుడు, ఆ బల్బులో ఫిలమెంటు (సన్నని తీగ) ఉంటే స్విచ్ వేసిన వానికి స్వచ్ఛమైన వెలుగు కనబడడం లేదా? అట్లాగే భక్తి యనే ఫిలమెంటు ఉంటే శ్రద్ధయనే బల్బు, స్విచ్చి ఉండగా ఆకారంలేని భగవంతుడనే విద్యుత్తు, కాంతి రూపంలో గోచరిస్తుంది. అట్లాగే భగవానుడు కూడా దివ్య మంగల స్వరూపునిగా గోచరిస్తాడు, సూర్యతాపం వల్ల సముద్రంలోని నీరు అవిరిగా మారుతోంది. ఆవిరి కంటికి కన్పిస్తోందా? అది చల్లబడి మేఘంగా మారినపుడు వర్షం ఆ వస్తోంది. ఆ నీరు ఇంకా చల్లబడితే మంచుగడ్డలు. అట్లాగే మన హృదయం లేదా మనస్సు, ఎంత చల్లబడితే ధ్యానం చేయగలిగితే, ఆకారం లేని పరమాత్మ ఆకారం ధరించి సాక్షాత్కరిస్తాడు.
ఈ ధ్యానము నిరంతరం సాగినపుడు, అన్ని కోరికలు విడిచినపుడు, తీవ్రమైన భక్తియున్నపుడు భగవదనుభవం కల్గుతుంది. ఎవరికైనా అట్టి భక్తి, జ్ఞానము కలిగితే మిగతా వారికి ఏమిటి లాభమని ప్రశ్నిస్తారు. కాని అట్టి వారిని ఒక్కమారు దర్శించినా ఏవో బాధలు పోయినట్లు, శాంతి లభించినట్లుంటుంది. కారణమేమనగా భగవదనుభూతిని సంపూర్ణంగా పొందారు కనుకనే. శాంతికంటే కావలసినది ఏముంది? అట్టి శాంతి ప్రదాతలే జ్ఞానులూ, భక్తులూ.
No comments:
Post a Comment