తత్వ ప్రేమకర మమ అరు తోరా |
జానత ప్రియా ఏక మను మోరా |
సో మను సదా రహత తోహి పాహీం |
జాను ప్రీతి రను ఎతనేహి మహీం ||
(శ్రీ రామచరిత మానసము 5-15-3)
సీతా! నీవు లేని నాకు ఈ సృష్టియందుగల వస్తువులన్నీ దుఃఖదాయకములైనవి. బయటకు చెప్పుకొన్న మనస్సులోని దుఃఖము కొంత తరుగగలదు. కాని నేనెవ్వరితో చెప్పుకోగలను? నా దుఃఖమును తెలిసికొన గలవారెవ్వరు? ప్రియా! నీనాప్రేమతత్వ రహస్యము నా మనస్సుకే తెలుసు. ఆ మనస్సు ఎల్లప్పుడు నీ చెంతనే ఉంటుంది. నా ప్రేమసారమంతా ఇదేనని తెలుసుకో.
జీవనాధారుడైన శ్రీరఘునాథచంద్రుని ప్రియసందేశాన్ని ఆలకించి సీతాదేవి ఆనందమగ్నురాలయ్యింది. ఆమె హనుమంతుని సంబోధిస్తూ ఇలా పలికింది. సుపుత్రుడా! శీఘ్రాతిశీఘ్రముగా శ్రీరామచంద్రుడు నన్నుద్ధరించేటట్లు ప్రయత్నం చెయ్యి, విలంబనమొనరించకు.
వినీతాత్ముడైన శ్రీపవనాత్మజుడు ఇట్లా పలికాడు. తల్లీ! నీ విక చింతించకు. ధైర్యము వహించి పరమప్రభువైన శ్రీరామచంద్రుని స్మరిస్తూ ఉండు. నేను మరలిపోగానే శ్రీరామచంద్రుడు సపరివారముగా విచ్చేసి రాక్షసులను సంహరించి నిన్ను అత్యంతాదరముగా, ప్రీతిపూర్వకముగా అనుగ్రహింపగలడు. అమ్మా! స్వామి నాకనుజ్ఞ ఇవ్వలేదు. లేనిచో నేను ఈ క్షణమే నిన్ను నా భుజములపై ఎక్కించుకొని శ్రీరామచంద్రుని చెంతకు చేర్చెడివాడను.
స్వల్పమైన వానర రూపమున నున్న హనుమంతుడిలా పలుకగా సీతా దేవి నవ్వి ఇలా పలికింది. “కుమారా! హనుమంతుడా! ఈలంకలో నున్న రాక్షసులను నీవు చూసావు. వారి శక్తియుక్తులు అపారములు. సుగ్రీవుని సైన్యములో నున్న వానరులందఱు నీవంటి చిన్న శరీరములు కలవారా ఏమి? నాకు సందేహము కలుగుతుంది.”
No comments:
Post a Comment