Wednesday 22 December 2021

శ్రీ హనుమద్భాగవతము (110)



దైత్యరాజైన రావణుడు తన ఎదుట పింగాక్షుడు, పింగ కేశుడు, పింగరోముడు, వానర శిరోమణియునైన శ్రీ ఆంజనేయుని చూసి రోషాగ్నిచే జ్వలించాడు. కాటుక కొండవలె నల్లనివర్ణము కల్గిన ప్రహస్తుడనే మంత్రిని చూసి రావణుడిలా పలికాడు. ప్రహస్తా! ఈ వానరుడు తానెవ్వడో ! ఎచ్చటనుండి వచ్చినాడో? వీని రాకకు కారణమేమో? అశోకవనమును విధ్వంసమేల చేసెనో ? అసురవీరులను నా కుమారుని సంహరించుటకు కారణమేమో ప్రశ్నింపుము.  

ప్రహస్తుడు హనుమంతుని చూసి ఇలా పలికింది. వానరా ! నీవు భయము చెందకు. ధైర్యము వహించు. నీవెవ్వరవు? ఎచ్చోటనుండి వచ్చావు? ఇచ్చటకు నిన్నెవరు పంపారు? సత్యం పలికితే నీకు ఎట్టి హానీ కలుగదు. మేము నిన్ను వదిలివేయగలము.


శ్రీరామభక్తుడైన ఆంజనేయుడు త్రైలోక్యవిజయుడైన రావణుని సభలో శంకారహితుడు, నిర్భయుడై ఉన్నాడు. ఆయన మహాప్రభువైన శ్రీరామచంద్రుని స్మరించి ఇలా పలుకనారంభించాడు. లంకాధిపతీ! రావణా! అనంతుడు, మహిమాన్వితుడు, దయామయుడు, మహాప్రభువైన ఎవ్వరి ఆశ్రయాన్ని పొంది మాయ సకలసృష్టి చేస్తుందో, ఎవని శక్తిచే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టిస్థితిలయములను చేస్తున్నారో, ఎవరి బలముపై ఆది శేషుడు ఈ విశ్వమును ధరించియున్నాడో, ఎవడు యుగయుగములందు గోబ్రాహ్మణులను, దేవతలను, భక్తులను, ధర్మమును రక్షించుటకు, భూమికి భారభూతులైన నీవంటివారిని సంహరించుటకు అవనిపై అవతరించాడో, ఆ శ్రీరామచంద్రుని దూతను నేను. కఠోరము దివ్యము, విశాలమైన శంకరభగవానుని ధనువును నీవు కదల్పనైనను కదల్ప లేకపోయావు. ఆ ధనుస్సును భగ్నం ఒనరించి దశరథనందనుడైన శ్రీరామచంద్రుని ఎరుగవా ? ఖరదూషణాదులు, త్రిశరుడు మొదలైన పదునాల్గువేల రాక్షసులను ఒక్కడే త్రుటిలో సంహరించిన శ్రీ రాముని ఎరుగవా? ఓరీ! నిన్ను తన చంకలో బంధించిన వాలిని ఒకే ఒక బాణముతో సంహరించాడు.

No comments:

Post a Comment