"జయ శ్రీరామ జయ శ్రీరామ" అంటూ హనుమంతుడొక భవనము పైనుండి మరియొక భవనము పైకి ఎగురుతూ లంకకు నిప్పుబెట్టాడు. ఆయన ఒనరించిన భీషణ గర్జనములకు ఆకాశము ప్రతిధ్వనించింది. దాని వలన అసురులు ప్రాణములను కోల్పోయారు. అసురపత్నుల గర్భములు పతనమయ్యెను. మహావీరులైన రాక్షసుల హృదయములు కంపించాయి. ఇట్లు “జయ శ్రీసీతారాం” అంటూ మైనాక వందితుడు, మహావేగవంతుడైన కపీశ్వరుడు ఎగురుతూ ప్రహస్తుని మందిరము పైకి చేరి దానికి నిప్పుపెట్టి అచటనుండి మహాపార్శ్వుని గృహమును తగులబెట్టి క్రమముగా వజ్రదంష్ట్ర, తుళ, సారణ, మేఘనాథ, జంబుమాలి, సుమాలి మొదలగు అసురశ్రేష్ఠుల నివాసములను బూడిదగావించాడు. ప్రజ్వలిత భయంకరాగ్ని జ్వాలలతో అరుణవర్ణముతో ప్రకాశించు శ్రీమారుతాత్మజుడు ప్రత్యక్ష కాలస్వరూపునిగా గోచరించాడు. భయముతో వణకుచున్న అసురులు ఆయన వైపు చూచుటకైనా సాహసింపలేకపోయారు. అత్యంత వేగశాలియైన కవీశ్వరునిలో అద్భుతమైన స్ఫూర్తి కలదు. ఆయన ఒక సౌధమునుండి మఱియొక సౌధముపైకి దుకుతూ గవాక్షముల గుండా ప్రవేశించి తన వాలముతో శీఘ్రముగా నిప్పు పెడుతున్నాడు. ఆయన సర్వత్రా చరిస్తూ విలయతాండవం చేసాడు. శ్రీహనుమంతుడు ఎక్కడున్నాడో తెలిసికొనుట వారికి కఠినమయ్యింది. వారు సర్వత్రా మర్కటాధీశ్వరుడైన శ్రీ హనుమంతుడు నిప్పు పెట్టుచున్నట్లు గాంచారు. ఒక హనుమంతుడే ఉన్నాడా? లేక అసంఖ్యాకముగా ఉన్నారా యని రాక్షసులు భ్రమపడ్డారు.
ఇట్లు శ్రీహనుమంతుడు, రశ్మికేతువు, సూర్యశత్రువు, హ్రస్వకర్ణుడు, దంష్ట్రుడు, రోమశుడు, రణోన్మత్తుడు, భుజగ్రీవుడు, భయానకుడు, విద్యుజ్జిహ్వుడు, హస్తిముఖుడు, కరాళుడు, విశాలుడు, శోణితాక్షుడు, మకరాక్షుడు, నరాంతకుడు, కుంభుడు, దురాత్ముడు, నికుంభుడు, యజ్ఞశత్రువు, బ్రహ్మ శత్రువు మొదలగు ప్రముఖులైన రాక్షసవీరుల భవనములను, ఆశ్వశాలలను, గజశాలలను, అస్త్రాగారములకు, సైన్య శిబిరములను తగులబెట్టాడు.
ఆ సమయములో కుమారుని కార్యమునకు సహాయమొనరించుటకై వాయు దేవుడు తన వేగమును తీవ్రముచేసెను. వాయు వేగమునకు అగ్ని అధికముగా ప్రజల్లుచు సర్వత్రా వ్యాపింపసాగింది. బంగారము, వెండి, రత్నాదులతో నిర్మించిన భవనములు మంటలకు కరగి భూమిపై ప్రవహించాయి. లంకా నగరములో గల స్త్రీ, పురుషులు, బాలకులు, వృద్ధులు మొదలగు అసురులందఱు మంటలకు తాళలేక 'రక్షింపుము రక్షింపుమనుచు, ఆక్రందించుచు అటునిటు పరుగిడ సాగిరి. లక్షలాది రాక్షసులు ఆ ప్రచండమైన అగ్నిజ్వాలలలో పడి మరణించారు. మిగిలిన వారు ప్రాణములను అర చేతబట్టుకొని పారి పోయారు.
No comments:
Post a Comment