ఆత్మ నిర్మలము, ఎల్లప్పుడును ఉపాధి రహితమని తెలుసుకోగానే మనుష్యుడీ సంసారము నుండి ముక్తుడగును. కావున ఓ మహామతీ! నేను నీకు అత్యంతికమైన మోక్ష సాధనమును ప్రవచిస్తాను. సానధానుడవై అవధరింపుము. (6)
విష్ణుభగవానుని శుద్ధభక్తి బుద్ధిని అత్యంత పవిత్రమొనరించును; దానిచే అత్యంత నిర్మలమైన ఆత్మజ్ఞానము లభిస్తుంది; ఆత్మజ్ఞానముచే శుద్ధుడైన జీవునకు ఆత్మతత్త్వానుభవము కలుగుతుంది. దృఢమైన ఆత్మజ్ఞానబోధ కలిగిన మనుష్యుడు పరమ పదప్రాప్తిని బొందును. (7)
కావున నీవు ప్రకృతికి అతీతుడు, పురాణపురుషుడు, సర్వ వ్యాపకుడు, ఆదినారాయణుడు, లక్ష్మీపతియైన శ్రీహరిని భజించు. హృదయములో గల శత్రుభావనను మూర్ఖత్వమును వదలి వేయుము. శరణాగతవత్సలుడైన శ్రీరామ చంద్రుని భజించు. సీతా దేవిని ముందుంచుకొని పుత్ర కళత్ర బంధు బాంధవ సహితుడవై భగవానుడైన శ్రీరాముని దివ్య చరణములును ఆశ్రయించు. దీని వలన నీవు భయము నుండి విముక్తుడవుతావు. (8)
తనహృదయములో విరాజమానుడైయున్న వాడు, అద్వితీయుడు, సుఖస్వరూపుడు, పరమాత్మ అయిన శ్రీ రామచంద్రుని భక్తిపూర్వకంగా ధ్యానమొనరించనివాడు దుఃఖతరంగ భరితమైన ఈ సంసారసముద్రము నెట్లు దాటగలడు? (9)
నీవు శ్రీరామచంద్రుని భజింపనిచో అజ్ఞానరూపమైన అగ్నిలో దగ్ధమయ్యెదవు. నీవొనరించిన ఈ పాపముల చే భవిష్యత్తులో ఈ జన్మనుండి చ్యుతుడవయ్యెదవు. ఇక మోక్షము అసంభవము కాగలదు. (10)
అసురరాజా! నేను మాటిమాటికి నిన్ను ప్రార్థించుచున్నాను. నీవు సీతను అత్యంతాదర పూర్వకముగా ముందుంచుకొని భగవంతుడైన శ్రీరామచంద్రుని చెంతకు పొమ్ము. ఆయన చరణారవిందముల పైబడి నీ వొనరించిన అపరాధములను క్షమించమని ప్రార్థింపుము. నీవు నా వాక్యములను విశ్వసింపుము, నిశ్చయముగా దయాంతరంగుడైన శ్రీరామచంద్రుడు నిన్ను క్షమించి అనుగ్రహించగలడు. ఇక నీవు లంకలో నిష్కంటముగా సుఖములను అనుభవించగలవు. నీ లౌకిక పారలౌకిక జీవన ముద్ధరింపబడగలదు. నీజన్మ సఫలము కాగలదు. నీవు ధన్యుడవయ్యెదవు.
No comments:
Post a Comment