భక్తాగ్రేసరుడైన శ్రీ ఆంజనీనందనుడు దశకంఠుని శుభము కొఱకిట్లు అమృతసదృశమైన ఉపదేశమొనరించుచున్నాడు. కాని దుర్బుద్ధియైన రాక్షసరాజునకు దౌర్భాగ్యమూ వలన ఆ ఉపదేశం అప్రియంగా తోచింది. రావణుడు కోపించాడు. అతని నేత్రములు ఎఱుపెక్కాయి. శ్రీహనుమంతునితో రావణుడు ఇట్లా పలికాడు. “వానరాధమా! దుష్టబుద్ధీ! నా సమ్ముఖమున ఇట్లు వాచాలత్వముతో పల్కు దుస్సాహసం ఎట్లా చేశావు? వనవాసులైన శ్రీరాముడు, సుగ్రీవుడు ఏ పాటి శక్తిగలిగినవారు? మొదట నేను ఇచ్చోటనే నిన్ను సంహరింస్తాను. తదనంతరము సీతను జంపి, తుదకు శ్రీరామ లక్ష్మణ సుగ్రీవసహితముగా సకలసైన్యమును మృత్యుముఖమున బడవేస్తాను." దశకంఠుని ఈ మిథ్యాదర్పపుపలుకులను విశుద్ధాత్ముడైన శ్రీవానరేశ్వరుడు సహింపలేకపోయాడు. పండ్లు పటపట కొఱకుచు ఇట్లా పలికాడు. “అధముడా! రాక్షసరాజా! నీ తలపై మృత్యువు తాండవమాడుచున్నది. ఆ కారణమువలనే ఇట్లు ప్రలాపాలు ఒనరించుచున్నావు. నేను భగవంతుడైన శ్రీరామచంద్రునకు సేవకుడను. నా శక్తిపరాక్రమాదులను నీవు ఊహించనైనా ఊహించజాలవు. నీ వంటి పాపాత్ములు నన్నెదిరించలేరు.
దురాత్ముడైన రావణుడు క్రోధాగ్ని జ్వాలలతో జ్వలిస్తూ కేకలు పెడుతూ 'రాక్షసులారా! వెంటనే దుష్ట వానరమును వధించండీ అని అసురసైనికులను ఆజ్ఞాపించాడు. వీరులైన రాక్షసులు కపీశ్వరుని సంహరించుటకు ఉద్యుక్తులు కాగా మధుర వాక్యకుశలుడైన విభీషణుడు రావణుని శాంతింపవలసినదని ప్రార్ధిస్తూ ఇలా పలికాడు. “వీరవరుడా! లంకేశ్వరా! ధర్మమునకు వ్యాఖ్యానం ఒనరింపవలెనన్న, లోకాచారములను పరిపాలింపవలెనన్న, శాస్త్రీయసిద్ధాంతములను అవగత మొనరించుకొనవలెనన్న నీకంటెను సమర్థుడు మరి ఒకడులేడు, కోపమును పరిత్యజించి శాంతచిత్తుడవై ఆలోచించు. దూతను ఎక్కడైనా, ఏ సమయమందైనా, ఎట్టి పరిస్థితులలోనైనా సంహరింపరాదని సత్పురుషులు నొక్కి వక్కాణించారు. దూత మంచివాడైనా, చెడ్డవాడైనా శత్రువులచే పంపబడినవాడు కావున అతడు శత్రువర్గమునే కొని ఆడును. దూత ఎల్లప్పుడూ పరాధీనుడు, కావున వానికి మృత్యుదండన విధింపరాదు. దూత యొక్క అవయవములను ఖండించుట మొదలగు ఇతర దండనలను విధింపవచ్చును.
తన తమ్ముడైన విభీషణుడు దేశకాలమునకు ఉపయుక్తమైన హిత వచనములను పలుకగా రావణుడు శాంతించి ఇట్లు పలికాడు. “విభీషణా! నీవు చెప్పినది బాగుగా ఉన్నది. వీనికి మరణ దండనము తప్ప అన్యమైన శిక్షను విధించుట అత్యంతము ఉచితము. వానరులకు వారి వాలము ప్రియము: వాలమే వారికి ఆభూషణము, కావున వీని వాలమును తగుల బెట్టుము. ఈ వానరుడు తన స్వామి చెంతకు వెళ్ళి స్వయంగా అతనిని మృత్యు ముఖమునకు తోడొడ్కొనిరాగలడు.
No comments:
Post a Comment