మహాపరాక్రమవంతుడైన మేఘనాథుడు, తన దివ్యరథాని అధిరోహించి రాక్షససైన్యములచే పరివృతుడై పవన పుత్రుని సమీపమునకు వెళ్ళాడు. ఇంద్రజిత్తు చేసిన భయంకర సింహనాదాన్ని ఆలకించి సర్వసమర్థుడైన ఆంజనేయుడు లోహస్తంభమును ధరించినవాడై గగనమునకు ఎగిరాడు. ధనుర్థరుడైన మేఘనాథుడు మహాశరప్రయోగముచే హనుమంతుని నొప్పించాడు. బృహత్కాయుడైన ఆంజనేయుడు లోహ స్తంభప్రహారముచే రథమును, రథసారధిని చూర్ణం చేసాడు. మేఘనాథుని అపారసేనావాహిని ఆంజనేయుని ప్రహారములకు రక్తము గ్రక్కుతూ మరణించింది.
ఆ కపీశ్వరుని శక్తి ఎదుట ఏ అస్త్రములు నిలువజాలకపోవుట చూసి మేఘనాథుడు అస్త్ర శిరోమణియైన బ్రహాస్త్రమును ప్రయోగించాడు. నిత్యస్వరూపుడైన పవనకుమారునకు బ్రహ్మ దేవుడు బ్రహ్మాస్త్రమునకు బంధింప బడకుండనట్లు ఆశీర్వదించియుంన్నాడు. కాని ఆంజనేయుడు బ్రహ్మదేవుని గౌరవింపదలచాడు. ఆయన బ్రహాస్త్రము గౌరవించుటకై తనంతట తానే బంధితుడయ్యాడు.
మాయాతీతుడైన శంకరనందనుడు బ్రహ్మాస్త్రము చేత బంధితుడగుట చూసి భీతులై పారిపోవుచున్న రాక్షసులు మరలివచ్చారు. వారు హనుమంతుని అనేక విధాలుగా దూషిస్తూ గొలుసులతో బంధించారు. అన్య బంధముచే బ్రహ్మాస్త్రము తొలగింది. బ్రహ్మపాశబంధనము అన్యబంధనముచే విడిపోవునని మూర్ఖులైన అసురులకు తెలియదు.
బ్రహ్మపాశముక్తుడైన వానరశిరోమణి కేవలము లోహపుగొలుసులచే బంధింపబడి యుండుట చూసి ఇంద్రజిత్తు చింతాక్రాంతుడయ్యాడు. బ్రహ్మాస్త్రం ఒక్క పర్యాయము విఫలమైతే మరల ప్రయోగించుట అసంభవమని మంత్రజ్ఞుడైన ఇంద్రజిత్తునకు తెలుసు. తన విజయము తనకు అనుమానాస్పదమైంది.
No comments:
Post a Comment