Tuesday, 14 December 2021

శ్రీ హనుమద్భాగవతము (102)



వానర శిరోమణీ, విశ్వరూపుడైన హనుమానుని వచనాలను ఆలకించగానే జానకీ దేవి సందేహము తొలగిపోయింది. ఆమె అత్యంత ప్రసన్నురాలయ్యింది. సీతాదేవి శ్రీ రామభక్తుడైన వీరహనుమంతుడిని ఆశీర్వదిస్తూ ఇలా పలికింది.” 


హోహు తాత బల శీల నిధాన ||

అజ అమర గుణనిధి సుత హోహూ |

కరహు బహుత రఘునాయక చోహూ |


-రామచరిత మానసము (5-16-1) 


"తండ్రీ! నీవు బలశాలివి, శీలవంతుడవు, జరారహితుడవు, అమరుడవు. గుణములకు నిధివి అగుదువుగాక ! శ్రీ రామ చంద్రుడు నీపై విశేష కృపను చూపుగాక!"


ప్రభుపు కృప చూపుగాక అనే ఆశీస్సును జగజ్జనని వలన ఆలకించి పవననందనుడు కృతార్థుడయ్యాడు. ఆయనకు సమస్త విశ్వమందుగల అమూల్యమైననిధులు ప్రాప్తించినట్లయ్యింది. తన విశ్వరూపమును విడచి హనుమంతుడు జనని చరణకమలములను ఆశ్రయించాడు. ఆయన ప్రేమానందమునకు అవధులు లేకపోయింది. ఆయన శరీరమంతా పులకించింది. నేత్రముల నుండి ఆనందాశ్రువులు ప్రవహించాయి. భువన పావనియైన జానకి యొక్క చరణ రేణువులతో శ్రీహనుమంతుని ముఖమండలము ప్రకాశించింది. హస్తములను ముకుళించి గద్గద స్వరముతో అతడి ఇట్లా పలికాడు. “జననీ! నేను కృతార్థుడనైయ్యాను. నా జీవనము ధన్యమయ్యింది. నాజన్మము సఫలమయ్యింది. విశ్వపావనీ! నీ ఆశీర్వాదం అమోఘము, జగత్ప్రసిద్ధము. అమ్మా! నాకు ఎందులకో ఆకలి కల్గుచున్నది. ఈ వనంలో ఎన్నో మధురఫలవృక్షములు ఉన్నాయి. అమ్మా! నీవు అనుజ్ఞ ఇస్తే ఈ ఫలములను ఆరగించి నా ఆకలిని తీర్చుకుంటాను. అపుడు జానకి ఇలా పలికింది. “కుమారా! నీవు ఫలములను ఆరగించి తృప్తిని పొందాలనే నేను ఆకాక్షిస్తున్నాను; కాని ఈ వనాన్ని బలవంతులు, శూరులు, వీరులైన దానవ సైనికులు రక్షించుచున్నారు.


నిర్భీకుడైన హనుమంతుడు “జననీ! నీ అనుజ్ఞ నాకు కావాలి. ఈ అసురులను గుఱించి నీవు చింతించవలదు” అని పలికాడు. 


సీతా దేవి మహావీనుడు, బలవంతుడు, బుద్ధిమంతుడైన హనుమంతుని చూసి ప్రసన్నురాలై ఇలా పలికింది. “కుమారా! శ్రీరామచంద్రుని స్మరించుకుంటూ ఇచ్ఛానుసారంగా మధుర ఫలములను ఆరగించు.”


No comments:

Post a Comment