బ్రహ్మాస్త్రముచే ముక్తుడయ్యి కూడా మంగళమయుడు, జ్ఞానమూర్తియైన పవనాత్మజుడు ఆ విషయమే తెలియనట్లు ప్రవర్తించడం ఆరంభించాడు. రాక్షసులు ఆంజనేయుని రావణసభకు తోడ్కొనిపోవ సాగారు. లంకానగర వాసులు దుర్భాషలాడుతూ పరిహసించసాగారు. కాని శ్రీ రామదూతైన శ్రీ ఆంజనేయుడు త నస్వామి కార్యము సంపూర్ణం ఒనరించుటకు సంకల్పించుకొనినవాడై అసురుల దూషణ తిరస్కారాదులను మౌనముగా భరించాడు. నగరములో గల సైన్యవిభాగ ప్రదేశాలను హనుమంతుడు జాగ్రత్తగ గమనించాడు. ఇట్లా మేఘనాథుడు ఆంజనేయుని రావణుని సభకు తోడ్కొనిపోయాడు.
హనుమంతుడు రావణునకు హితోపదేశము చేయుట
తండి సమ్ముఖమునకు వచ్చి మేఘనాథుడు ఇలా పలికాడు... "పితృదేవా! అసాధారణమైన ఆ వానరము అసంఖ్యాకులగు మన రాక్షసవీరులను సంహరించింది. నేను బ్రహ్మాస్త్రముచే అతనిని బంధించి తెచ్చితిని. మీరు మంత్రులతో - సంప్రదించి ఏది ఉచితమో దాని చేయండి.”
నీతి నిపుణుడైన హనుమంతుడు రాక్షస చక్రవర్తియైన రావణు నిసభను జాగ్రత్తగా పరిశీలించాడు. తప్తమైన సువర్ణం వంటి తేజస్సు కలవాడు, బలసంపన్నుడు, బ్రహ్మవంశ కులోద్భవుడైన దశాననుడు నానారత్నములచే జటితమై - ప్రకాశించు విశాల స్ఫటికమణి సింహాసనముపై ఆసీనుడి ఉండుట హనుమంతుడు చూసాడు. రావణుని శిరముల బహుమూల్యములు, దీప్తిమంతములు, రత్నజటితము ప్రకాశిస్తూన్నది. మంత్రతత్వవేత్తలగు దుర్థరుడు, ప్రహస్తుడు, మహాపార్శ్వుడు, నికుంభుడు అనే నల్వురు మంత్రులు రావణుని పరివేష్టించి ఉన్నారు.
ప్రకాశవంతుడైన ఆ రాక్షసరాజు యొక్క తేజముచే ప్రభావితుడై ధర్మమూర్తియైన పవనకుమారుడు తనలో తానిట్లా అనుకొన్నాడు. శక్తితో, ఈ అద్భుతరూపముతో, అనుపమాన శక్తితో, ఆశ్చర్యకరమైన తేజముతో సంపన్నుడైన రావణునిలో ప్రబలమైన ఈ (సీతాపహరణ మను) అధర్మము లేకున్నచో ఇతడు సకలవిశ్వమునకు సంరక్షకుడు కాగలిగేడివాడు.
No comments:
Post a Comment