Thursday 16 December 2021

శ్రీ హనుమద్భాగవతము (104)



వికృతముఖములు కల్గిన కొందఱు రాక్షస స్త్రీలు సీతా దేవి చెంతకు వెళ్ళి వానరాకారుడు, భయంకరుడైన ఈ వీరుడెవ్వడని ప్రశ్నించారు. అందులకు సీతా దేవి రాక్షసమాయలు మీకే తెలుస్తుంది, దుఃఖితురాలనైన నేనేమి చెప్పగలనని ప్రత్యుత్తరం ఇచ్చింది.


మృత్యువు నుండి బయటపడిన కొందఱు అసురవీరులు పరుగుపరుగున రావణుని సభకు వెళ్ళి ఇట్లా పలికారు. "ప్రభూ! వానరాకారములోనున్న ఒక ప్రాణి ఎచ్చట నుండియో వచ్చి అశోకవనమున ప్రవేశించినది. సీతాదేవితో సంభాషించి తదనంతరము అశోక వాటికను విధ్వంసం చేసింది. వనమునందు గల వృక్షములన్నో ధ్వంసమై అయ్యాయి; అంతేకాదు మణి నిర్మితమైన చైత్య ప్రాసాదమును భగ్నం చేసి ఎదురించిన అసురవీరులను సంహరించి ఆ మహావానరుడు నిర్భయుడై, నిశ్చింతుడై, ఆ వనములో కూర్చుని ఉన్నాడు. మేము ఇద్దరం మాత్రమే మృత్యువాత నుండి బయటపడిన వారమై మిమ్ము జేరాము.


రావణుడు ఎంతో కోపించాడు. అతడు ప్రాతః కాలమున దుఃస్వప్నములో కూడా వానరుడు లంకను ధ్వంసం చేస్తున్నట్లు చూశాడు.


అసురులు పలికిన వచనములను ఆలకించి లంకాధీశ్వరుడు రక్తపంకజలోచనుడై ఒక విశాలమైన అసుర సైన్యమును పంపాడు. 


ఆ సమయములో స్వర్ణ శైలసదృశుడైన కపిశ్రేష్ఠుడు విశాలమైన లోహ స్తంభమును బూని అసుర సైన్యము కొఱకై నిరీక్షించుచున్నాడు. మహా తేజస్వియైన ఆ పవనకుమారుని ముఖము అరుణవర్ణంగా ఉండింది. ఆతని ఆకృతి అత్యంత భయంకరంగా ఉంది. రక్కసుల విశాల సైన్యము వస్తుండటం చూసి ఉగ్ర వేగుడైన హనుమంతుడు భయంకరంగా గర్జించాడు. మల్ల విద్యకు పరమారాధ్యుడు, వికటమూర్తియైన ఆంజనేయుని భయంకర గర్జనాన్ని ఆలకించగానే రాక్షస వీరుల హృదయములు కంపించాడు. వారు వానరేశ్వరుడైన హనుమంతునిపై భయంకరమైన అస్త్రశస్త్రములను ఎన్నింటినో ఒక్కుమ్మడిగా వర్షింప ఆరంభించారు; కాని అమిత విక్రముడు, క్రోధముచే రక్త పంకజ లోచనములు గలవాడైన పవనకుమారుని ప్రహారముల ఎదుట ఆ అసుర వాహిని క్షణములో వివశయై మత్యువాతపడ్డాడు.


No comments:

Post a Comment