Friday, 31 December 2021

శ్రీ హనుమద్భాగవతము (118)




అన్నములు, వస్త్రములు, అభూషణములు, గజ తురగాదులు, అస్త్రములు మొదలగునవన్నీ అగ్నిలో పడి మండుచుండెను. తమ ప్రాణములను తాము దక్కించుకొనుటకు ప్రయత్నించుచున్న దానవులు వాటిని రక్షించుట కెట్టి ప్రయత్నము చేయలేకపోయారు. అనాథవలె, అసహాయురాలి వలె రావణుని లంకానగరము అగ్నిజ్వాలలలో బడి భగభగ మండనారంభించెను, పశువులు, స్త్రీలు, బాలకులు రోదించుచుండగా త్రైలోక్యవిజయులైన అసురులు అగ్నిని నివారింపలేక అసహాయులవలె చూచుచుండిరి. అగ్ని శాంతించిన గృహములకు పవననందనుడు మరల నిప్పుపెట్ట నారంభించెను. ఆయన లంకపై ఎగురుతూ లంకానగర దహన కార్యక్రమమును పర్యవేక్షించాడు.


తన మహత్తరమైన భవనము అగ్నికి ఆహుతి అగుట గాంచిన దశగ్రీవుని హృదయము కంపించింది. అయినను తన మనోగత భావములను దాచుకొని అతడు ఆంజనేయుని పట్టి వధింపవలసినదిగా రాక్షసులును ఆజ్ఞాపించెను.


ప్రభువు ఆజ్ఞ ఆలకింపగానే మేఘనాదాధి వీరులు శస్త్రములను ధరించి హనుమంతుని పట్టుటకు సమావేశమైరి. వారెచ్చోట దృష్టిసారించిన అచ్చోట కాలస్వరూపుడైన శ్రీ హనుమంతుని భయంకరమూర్తి కనబడసాగెను. జ్వలించుచున్న శ్రీ పవనాత్మజుని వాలము వజ్రతుల్యము, సుదీర్ఘము. ఎందఱో రాక్షసవీరులు వాలముపై కలియబడిరి. వారందఱు వాలాఘాతములకు గురియై అసువులను బాసిరి. ప్రబలమైన ప్రభంజనము యొక్క, భయంకరమైన అగ్నిజ్వాల యొక్క నడుమ అసహాయులైన అసురులు శ్రీ ఆంజనేయుని ఎదిరించ లేకపోయారు. వారు రావణుని ఎదుట విషణ్ణవదనులై తమ అశక్తతను ప్రకటించుకున్నారు.

లోకపాలకులు, దేవతలు మొదలైన వారందఱు రావణునకు వశులై ఉన్నారు. వారినందరిని శ్రీ ఆంజనేయుని నిర్జించుటకా రాక్షసరాజు పంపెను. లంకను దహించుచున్న శ్రీ హనుమంతుడు యముని తన నోటితో పటుకొని దేవతలను వాలముతో మోదాడు. ఆ మహావీరుని ధాటికి వారు నిలువలేక పలాయనము చిత్తగించిరి. యముడు శ్రీ ఆంజనేయునిచే బంధింపబడెను. సృష్టి కార్యములు స్తంభించెను. అపుడు దేవతాసహితుడై హంసను అధిష్ఠించి చతుర్ముఖుడైన బ్రహ్మ ఆ ప్రదేశమున కేతెంచి శ్రీహనుముతుని ప్రార్థించెను, శుభ ప్రదాతగా హనుమంతుడు యముని తన దంష్ట్రముల బంధమునుండి ముక్తుని గావించెను. యమును ఆ కాలమూర్తిని అనేక విధముల ప్రార్థించి నీ భక్తుల సమీపమునకు పోజాలనని ప్రతిజ్ఞ చేసెను.

No comments:

Post a Comment