Tuesday 28 December 2021

శ్రీ హనుమద్భాగవతము (115)



దుష్టుడైన దశాననుడు అసురగణమును ఇట్లా ఆజ్ఞాపించాడు. “దైత్య వీరులారా! ఈ వానరుని ధూషితూ లంకానగరమంతా తిప్పి, తుదకు వీని వాలమునకు నిప్పు బెట్టుడు.”


లంకా దహనము


సత్యగుణసంపన్నుడు, పరమపరాక్రమవంతుడు, కపికుంజరుడు అయిన శ్రీ అంజనానందవర్ధనుడు శ్రీరామకార్యమును పరిపూర్ణం ఒనరించుటకు తన దివ్యరూపాన్ని దాచియుంచాడు. లంకాధిపతియైన రావణుని ఆజ్ఞానుసారంగా రాక్షస యోధులు అనేక వస్త్రములను దెచ్చి వాటిని నేతిలో ముంచి హనుమంతుని వాలమునకు చుట్టడం ఆరంభించారు. దుష్టుడైన దశాననుని ఆజ్ఞాపాలకులైన అసురులు హనుమంతుని వాలమునకెన్ని వస్త్రములను చుట్టినా అది పొడవగుతూనే ఉంది, కపీశ్వరుని ఈ క్రీడ వలన లంకానగరములోని వస్త్రములకు, ఘృతమునకు కరవు ఏర్పడింది; కాని రాక్షసులు లంకా నగరములో వెదకి వెదకి వస్త్రములను దెచ్చి ఘృతములో తడిపి శ్రీఆంజనేయుని వాలమునకు జుట్టి అతనిని పగ్గములతో బంధించారు.


దృఢమైన రజ్జువులతో కట్టబడిన శ్రీకపికుంజరుడైన కేసరీకిశోరుని రాక్షసులు పట్టుకొని సంతోషముతో తీసుకుని పోవసాగారు. వారు భేరీమృదంగాదులను మ్రోగిస్తూ శ్రీహనుమంతుడు ఒనరించిన అపరాధములను వర్ణించుచు రాజమార్గములందు త్రిప్ప సాగారు. శత్రుదమనుడైన శ్రీహనుమంతుని వెనుక అసురులు, అసుర బాలకులు చప్పట్లు కొండుతూ అతనిని దూషించ ఆరంభించారు. కొందఱు శ్రీ పవనాత్మజునిపై రాళ్ళు వేయగా మణికొందఱు పిడికిళ్ళతో గ్రుద్దడం ఆరంభించారు; కాని బుద్ధిమంతుడైన శ్రీహనుమంతుడు తన ప్రభువు యొక్క కార్యసిద్ధికొఱకై కించిన్మాత్రమైనా బాధనొందక వారు పెట్టే యాతనలనన్నింటిని ప్రసన్నతాపూర్వకముగా సహించాడు, రాత్రి కాలమందు శ్రీహనుమంతుడు లంకానగర దుర్గ నిర్మాణాన్ని సాంగోపాంగముగా దర్శింపలేకపోయాడు: కాని ఇప్పుడు రావణుడు విధించిన ఈ దండనవలన లంకానగరమంతా తిరుగుతూ సావధానముగా పరికింపనారంభించాడు. ఆ నగరములో అద్భుతములైన పురములను, సుందరమైన అట్టాలికలను, సుందరగృహపంక్తులతో ఆవృతమైయున్న మార్గములను, ప్రఖ్యాతమైన రాక్షసుల నివాసములను, సైనిక స్థావరములను, మహత్వపూర్ణమైన ప్రదేశాలను శ్రీహనుమంతుడు చూసాడు.


రాక్షసులు కపీశ్వరుని బంధించి లంకానగర మంతా త్రిప్పారు. తనివిదీర దూషించారు. తుదకు వారు శ్రీహనుమంతుని ఒక కూడలియందు నిలిపి ఆనందోత్సాహములతో అట్టహాసములు ఒనరించుచున్నారు. అదే సమయములో ఒక ప్రముఖుడైన అసురవీరుడు వాలమునకు నిప్పు బెట్టాడు. వాలమున అగ్ని రగుల్కొనగానే రాక్షసులు, రాక్షసస్త్రీలు హర్షాతిరేకముచే నృత్యం చేస్తూ కరతాళధ్వనులు చేయసాగారు.


No comments:

Post a Comment