Wednesday, 8 December 2021

శ్రీ హనుమద్భాగవతము (96)



మీ అందరికి దుర్దినములు దాపురించినవి. మీకిక శరణు లభించదు. కావున మూర్ఖ స్త్రీలారా ! ఆమెను దుర్వచనములచే బాధించుట మానుకొని, ఆరాధించండి. సీతా దేవితో మధురంగా మాట్లాడుతూ సౌమ్యంగా వ్యవహరించండి. క్షమింపవలసినదిగా విదేహరాజపుత్రిని ప్రార్థించండి. ఇందులోనే మీకు శుభము కలదు.


త్రిజట పలికిన వచనములను ఆలకించి రాక్షసస్త్రీలు భయము చెంది సీతాదేవి పాదములపై బడి క్షమించమని ప్రార్థించి ఆ ప్రదేశము నుండి తొలగిపోయారు. సీతాదేవి దుఃఖమునకు అంతులేదు. ఆమె వ్యాకులయై త్రిజటతో ఇలా పలికింది. “తల్లీ ! ఈ విపత్కాలములో నీవు నాకు ఊరట కల్గింప ప్రయత్నించుచున్నావు; కాని ప్రాణనాథుని వియోగముచే దుఃఖించుచున్న నేను ఈ భయంకరులైన రాక్షసుల మధ్య జీవించి ఉండుటవలన ఎట్టి లాభమును లేదు. నీవు నాకొక సహాయం ఒనరించు. శుష్క కాష్ఠములను సమీకరించి చితిని పేర్చుము. దానిని జ్వలింపజేసి నేను అగ్నికి ఈ శరీరాన్ని ఆహుతి చేసెదను. నీ ఈ ఉపకారమును నేను మరువ లేను. భరింపలేను. ఈ కష్టములను నేనింక భరించలేను.


ఇట్లు పల్కి సీతాదేవి దుఃఖంపనారంభించింది. ఆమె దుఃఖమును గాంచి త్రిజట దుఃఖితురాలై అనేక ఉక్తులతో ఊరడించి సమాధానపరచి వెడలిపోయింది. సీతా దేవియొక్క కరుణాక్రందనమును విని వృక్షముపై దాగియున్న వజ్రాంగుడైన శ్రీహనుమంతుని హృదయము విదీర్ణమయ్యింది. ఆయన నేత్రములనుండి అశ్రుధారలు ప్రవహింపనారంభించాయి. సీతాదేవి సమక్షమునకు తత్ క్షణమే వెళితే ఆమె భయపడుతుందేమో అనే శంకతో ఆగిపోయింది.


దుఃఖావేగముచే సీతా దేవి శరీర త్యాగమే ఉచితమని సంకల్పించుకొన్నాడు. ఆమె ఇట్లా ఆలోచింపసాగింది. “ఉరి తగిలించుకొని మరణించుటకు నా వేణి చాలును” అని ప్రాణములను విడచుటకు నిర్ణయించుకొని విదేహరాజకుమారి లేచి నిలుచుంది. ఆమె నేత్రముల నుండి అశ్రుధారలు ప్రవహించుచున్నాయి.

No comments:

Post a Comment