Wednesday, 15 December 2021

శ్రీ హనుమద్భాగవతము (103)



అశోకవన విధ్వంసము


సకలశాస్త్రపారంగతుడు, విద్వాంసుడైన శ్రీ పవన కుమారుడు ఇట్లాలోచించాడు - “దూత యొక్క కార్యము స్వామి హితార్థమై మార్గమును సుగమం ఒనరించుటమే. రాక్షసేశ్వరుడైన రావణుని ఈ దుర్గం అభేద్యము. ప్రతి ద్వారమందు అద్భుతములు, విచిత్రములైన యంత్రముల మర్చబడియున్నవి. అవి ఉండగా ఎంతటి వీర సైన్యమైనా దుర్గమున ప్రవేశించుట అసంభవము. అదీగాక, అగమ్యమైన ఈ లంకానగరాన్ని రాత్రియందు చూసాను. దశకంథరుని వ్యక్తిత్వము, వాని వీరత్వము ఎలా అవగతం కాగలదు? శత్రు సైన్యముల శక్తియుక్తులను తెలుసుకోవడం అత్యంతావశ్యకము. అంతేకాదు, రావణుని, అతని మనో స్థైర్యమును సడలింపకేస్తే లాభము కలుగుతుంది. సీతామాతకు నేనిచ్చిన ఆశ్వాసనమునకు విశ్వాసము కల్గిస్తే ఆమె ధైర్యపూర్వకముగా శ్రీ రామాగమనముకొఱకై ఎదురుచూడగలదు, కావున లంకను బాగా పరిశీలించి లంకాధిపతియైన రావణుని కలుసుకొని మరలటమే ఎక్కువ ఉపయోగము కాగలదు, కాని అతనితో కలవటం ఎలా సంభవించగలదు? ఏ ఉపాయంతోనైనా ఈ అసురులను ఉత్తేజితులను చేస్తే, వారు నను నన్ను రావణుని సమ్ముఖమునకు కొనిపోగలరు.


ఇట్లా ఆలోచించుకొని పవనపుత్రుడైన హనుమంతుడు ఒక వృక్షముపైకి లంఘిచి మధుర ఫలములను ఆరగింప ఆరంభించాడు. కొన్ని ఫలములను కొరికి క్రిందపడవేస్తున్నాడు. ఒక వృక్షము యొక్క కొమ్మను విరచాడు, మఱియొక వృక్షాన్ని సామూలాగ్రంగా పెకలించి వెసాడు. ఈ ప్రకారంగా అశోక వనమును ధ్వంసం చేయడం ఆరంభించాడు. సీతా దేవి ఉన్న ప్రాంతము తప్ప అన్యమైన అశోక వాటికనతా అస్తవ్యస్తం చేసాడు. అమితసుందరమైన ఆ వనము క్షణంలో ధ్వంసమైపోయింది. హనుమంతుడు గగనాన్ని అంటుచున్న ఒక చైత్యప్రాసాదముపై ఎగిరికూర్చున్నాడు. శక్తిసంపన్నుడు, మహా దేవాత్మజుడు, పరమ తేజస్వీ, శివావతారుడైన కపీశ్వరుడు విశాలశరీరుడై లంక ప్రతిధ్వనించునట్లుగా అట్టహాసం చేస్తూ ఆ చైత్యప్రాసాదాన్ని ఖండఖండాలుగా భగ్నం చేశాడు. 


విశాలకాయుడైన హనుమంతుని గర్జనాన్ని ఆలకించి తమోగుణ సంపన్నులైన రాక్షసులు అదరిపడి లేచి భయపడసాగారు. వారు తక్షణమే నానావిధములైన ఖడ్గతోమరముద్గర గదాద్యస్త్రశస్త్రములను తీసుకుని చైత్య ప్రాసాదాభిముఖముగా పరుగెత్తసాగారు. మనోహరమైన అశోకవనము విధ్వంసమవ్వటం చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఆ అసురులు కోపించినవారై నఖదంష్ట్రాయుధములతో పవనకుమారునిపై దాడిచేయసాగారు. కాని మహాశక్తిసంపన్నుడైన శ్రీహనుమంతుని ఎదుట ఆ అసుర సైన్యము క్షణమైనా నిలువలేకపోయింది. భగ్నమైన ప్రాసాదము యొక్క, దాని ఖండముల యొక్క, తర శాఖల యొక్క క్రిందపడి వారు మరణించారు. 

No comments:

Post a Comment