Saturday 4 December 2021

శ్రీ హనుమద్భాగవతము (92)



మరుక్షణమే తల్లి యొక్క దయనీయమైన దశను గాంచి హనుమంతుడు అత్యంత దుఃఖితుడయ్యాడు. ఆయన తానిప్పుడు ఏమి చేయవలెనో అని ఆలోచింప ఆరంభించాడు. అంతలో కోలాహలమును విని పవననందనుడు అశోకవృక్షము యొక్క కొమ్మలలో సావధానుడై దాక్కున్నాడు. జానకీ దేవి భయముతో ముడుచుకొని కూర్చున్నాడు.


కాటుక కొండవంటి వర్ణము గల దశముఖుడైన రావణుడు అనేక రాక్షససుందరీమణులతో పరివృతుడై వచ్చుటను పవన పుత్రుడు గాంచాడు. వారిలో రావణపట్టమహిషి మండోదరి కూడకలదు. 


సీతా దేవిని సమీపించి రావణుడిట్లా పలుక ఆరంభించాడు. “జనక రాజకుమారీ! నేనంటే నీవేందుకు భయపడుతున్నావు? నేను నిన్ను నా ప్రాణముల కంటె అధికంగా వాంఛించుచున్నాను; వ్యర్థముగా నీవెందుకు ఈ కష్టములను అనుభవించుచున్నావు? నీ ఈ అపారదుఃఖమును చూడలేకున్నాను. ఆ వనవాసియైన రామునిలో ఏమి కలదు ? ఆతనిలో ఎట్టి శక్తి ఉన్నా ఇచ్చటి వచ్చి నిన్ను బంధవిముక్తురాలుగా చేయగలిగెడ్వాడు; కాని నేను ముల్లోకములను జయించినవాడను. దేవతలైనను, అసురులైనను, నాగ కిన్నెర గంధర్వ కింపురుషాదులైనను నా పేరు విన్నంతనే కంపించెదరు. ఇక మానవులెంత? ! త్రికూటస్థితమైన ఈ లంకానగరములో గల దుర్భేద్య దుర్గమందు ఒక పక్షియైనా నా అనుజ్ఞలేక ప్రవేశించుట అసంభవము. ఇక శతయోజన విస్తీర్ణముగల సాగరమును దాటి ఆ వనవాసియైన రాముడీ ప్రదేశమునకు ఎట్లా రాగలడు ? అతడు అసమర్థుడు; మమకారము లేనివాడు; నిరభిమానుడు; మూర్ఖుడు. అట్టివాని కొఱకై ఎందులకు ఎదురు చూచెదవు ? నీవు నాదానివి కమ్ము, గంధర్వులు, నాగులు, యక్షలు, కిన్నెరులు మొదలైన వారందఱు వారివారి స్త్రీలతో కూడా నిన్ను సేవించెదరు. నేను అత్యంతసమర్థుడను. నేను సంకల్పించినచో నిన్ను బలాత్కారముగా నా దానిగా చేసికొనగలను; కాని నేను నిన్ను హృదయపూర్వకముగా ప్రేమించుచున్నాను. ఈ కారణము వలననే నీ కెట్టి క్లేశమును కలిగించుట ఉచితముకాదని ఆలోచించుచున్నాను. నీవు స్వయముగా నాకోరికను మన్నించు. ఇందులోనే నీకు శుభము కల్గును”.


ఎన్ని సార్లు బుజ్జగించినా, బెదరించినా సీతా దేవి పై ప్రలోభము యొక్క ప్రభావము ఏమాత్రము పడకుండుట చూసి దశకంఠుడు మరల ఇట్లు పలుకసాగాడు. “సుందరీ! నాలో రోషానలజ్వాల ప్రజ్వరిల్లక ముందే నీ నిర్ణయమును నాకు అనుకూలంగా చేసుకో, లేనిచో ఈ తీక్ష్ణకరవాలముచే నీ శిరమును ఖండిస్తారు. నీ శరీరమాంసమును ఈ రాక్షసులు భక్షింపగలరు. 


No comments:

Post a Comment