Saturday 11 December 2021

శ్రీ హనుమద్భాగవతము (99)



హనుమంతుడు సీతా దేవికి శ్రీరామముద్రికను ఇచ్చాడు. ప్రకాశపుంజములను వెదజల్లుచున్న రత్నజటితము శ్రీరామనామాంకితము అయిన ముద్రికను జానకీ దేవి ధ్యానపూర్వకముగా చూసింది. ఆమె ఆనందమునకు అంతులేదు, అమె నేత్రములనుండి ప్రేమాశ్రువులు ప్రవహింప ఆరభించాయి. శ్రీరామచంద్రుని దూత అయిన హనుమంతునిపై పరిపూర్ణ విశ్వాసము కలుగగనే సీతా దేవి ఇలా పలికెను. ‘పవనపుత్రా! నీవు నా ప్రాణములను రక్షించావు. నిశ్చయంగా నీవు నా జీవితేశ్వరునకు అనన్యభక్తుడవు. నా ప్రభువు నీపై పరిపూర్ణమైన విశ్వాసముంచాడు. లేనిచో పరపురుషుని నా చెంతకు పంపరు. హనుమాన్! నీవు నా దశను చూశావు. క్రూరులైన ఈ నిశాచరుల నడుమ నేనెలా జీవించుచున్నానో చూశావు. శ్రీ రామచంద్రుని ఎడబాసి నేనెట్లు జీవించగలను. నా ప్రభువునకు నివేదించు. సమయము ముగియగానే పాపాత్ములైన రాక్షసులు నన్ను సంహరిస్తారు. నన్ను ప్రభువు ప్రాణము చూడాలనుకుంటే ఒక నెల లోపలనే లంకకు వచ్చి రాక్షస వంశమును సంహరించాలి. అంజనీనందనా! నీవుకూడ యుక్తియుక్తముగా స్వామికి విన్నవించి వెంటనే రాక్షసులను సంహరింపజేసి నన్నుద్ధరింపజేయ్యి.


సీతా దేవి వ్యాకులపాటుతో మరల ఇలా పలికింది - “హనుమా! ఆపత్సద్రమున మునుగుచున్న నాకు నీవు గొప్ప సహాయకుడవైనావు. ప్రభువునకు దూరమైన నేను నీటినుండి దూరమైన చేప వలె కొట్టుకొనుచున్నాను. దయామయుడైన ఆ ప్రభువు నన్నెప్పుడైనను తలుస్తున్నాడా?


బద్ధాంజలియై వినయపూర్వకంగా శ్రీ ఆంజనేయుడిట్లా పలికాడు. “తల్లీ ! నీ వియోగమువలన శ్రీ రామచంద్రుడు అనుభవించుచున్న దుఃఖమును వర్ణించుటకు సర్వదా నేను అసమర్థుడను. ఆర్యాంబికా! నిన్ను చూడని కారణమున శ్రీరామచంద్రుని హృదయము ఎల్లప్పుడూ శోకముతో నిండి ఉంటుంది, ఆయన మనస్పెప్పుడూ నీ ధ్యానమందే లఘ్నమై ఉంటుంది. నీ వియోగదుఃఖముచే శ్రీ రాముడు తన్ను తాను మరచిపోయాడు. నిన్ను గురించి తప్ప మఱియే విషయమును గురించి రాముడు ఆలోచించటం లేదు. నీ యెడ గల చింతతో ఆయన నిదురించుట లేదు. ఒక క్షణము కన్నుమూసినా 'సీతా! సీతా!' అంటూ మేల్కొనుచున్నాడు. అమ్మా ! శ్రీరామచంద్రుని శంకింపకు. ఆయన హృదయమున ద్విగుణీకృతమైన ప్రేమ నీ పైకలదు. కరుణానిధానుడైన ప్రభువు సజలనేత్రములతో నీకిట్లు సందేశాన్ని పంపాడు."

No comments:

Post a Comment