Thursday, 23 December 2021

శ్రీ హనుమద్భాగవతము (111)



నీవు నా స్వామిని ఎరుగనట్లు నటించినా ఆయన తన ధర్మపత్నిని హరించిన నిన్ను ఎలా మరువగలడు? రావణా! సర్వశక్తిసంపన్నుడు, మహాప్రభువైన ఆ శ్రీరామచంద్రుని దూతను నేను. మహాప్రతాపవంతుడైన వాయుదేవుని కుమారుడ నైన హనుమంతుడను.


కిష్కిందాధిపతీ, శ్రీరామచంద్రుని స్నేహితుడైన సుగ్రీవుడు సీతా దేవిని అన్వేషించుటకు కోటాను కోట్ల వానర భల్లూక వీరులను నాల్గుదిశలకు పంపాడు. వారిలో ఒకడనైన నేను శత యోజన విస్తీర్ణమైన సాగరాన్ని లంఘించి నీ లంకకు జేరాను. సీతను చుసాను. లంకను వినాశం ఒనరించు మహాకాల స్వరూపిణి సీతా దేవి అని తెలుసుకో. సీతా దేవి రూపమును ధరించి కాలపాశమే నీ చెంతకు వచ్చినది. రావణా! శ్రీరామాపరాధం చేసి సుఖించినవాడు త్రిలోకములందెవ్వడూ లేడు. మహాయశస్వియైన శ్రీ రామచంద్రుడు చరాచర ప్రాణిసహితంగా సమస్త విశ్వాన్ని నాశనము చేసి మరల సృష్టించగలడు. ఆ చతుర్ముఖుడైన బ్రహ్మ, త్రినేత్రుడైన త్రిపురారి, సహస్రాక్షుడైన ఇంద్రుడు, దేవతలు, దైత్యులు, గంధర్వులు, విద్యాధరులు, నాగులు మొదలగు వారందఱు కలిసివచ్చినా సమరాంగణములో శ్రీరాముని ఎదుట ఒక్కక్షణమైనా నిలువుజాలరు.


నేను నా ప్రభువు మొక్క ఆదేశానుసారంగా సీతా దేవిని దర్శించుటకు వచ్చాను. నాకు ఆకలి కాగా ఫలములను తిన్నాను. నా స్వభానుసారంగా వృక్షాలను విధ్వంసం చేసామి. కాని నీ సైనికులు నాపై దాడి చేసారు. నన్ను నేను రక్షించుకొనుటకు వారిని సంహరించాను. ఎవని శరీరము వానికి ప్రియము కదా! ఇందు నా దోషమేమిగలదు? అపరాధము నీ కుమారుడు చేసాడు. నన్ను అన్యాయంగా బంధించి తెచ్చుటను నీవే స్వయంగా చూస్తున్నావు గదా!


కపీశ్వరుడు, మహాభక్తుడైన హనుమంతుడు నిర్భయంగా చాతుర్యంగా పలికిన వచనములను ఆలకించి దేవగణములు ప్రసన్నములయ్యాయి. అసురగణములు భయాక్రాంతులై కంపింప సాగాయి. శ్రీరామచంద్రుని శక్తిని, మహిమను వినినతనే వారి మనోబలము సన్నగిల్లింది. రావణుడు క్రోధముతో పండ్లుకొరకడం ఆరంభించాడు. పరమబుద్ధిమంతుడు, మంగళ మూర్తి అయిన శ్రీ ఆంజనేయుడు అత్యంత శాంతి పూర్వకంగా దశగ్రీవుని హితార్థం ఇలా ఉదేశింపనారంభించాడు.


No comments:

Post a Comment