Saturday 18 December 2021

శ్రీ హనుమద్భాగవతము (106)



అప్పుడు హరాంశజుడైన అంజనీనందనుని ఆకారము భయంకరంగా పర్వతమువలె పెరిగిపోయింది. అతని భీషణాకృతి చేత ఆకాశమును విదీర్ణం ఒనరించు గర్జనముచేత అసురులు భీతులై ప్రాణము లేనివారయ్యారు. వారి అస్త్రశస్త్రములు శక్తిసంపన్నుడైన ఆంజనేయునకు ఆట వస్తువులవలె గోచరించాయి. క్షణకాలములోనే ఆ సర్వసైన్యమును ఐదుగురు సేనాధిపతులతో పాటు తన పదాఘాతములచే హనుమ సంహరించాడు. అసురులు శవములతో ఆ ప్రదేశమంతా నిండిపోయింది. వానరాధీశ్వరుడైన శ్రీపవనసుతుడు ఇనుప స్తంభమును ధరించి అన్యరాక్షస సైన్యముల కొఱకై నిరీక్షించుచున్నాడు. ఆ సమయములో క్రోధముచే రక్తపంకజ లోచనుడైన కపిసత్తముడు రాక్షస సంహారార్థమై విజృంభించిన భయంకరుడైన మహాకాలునిగా గోచరిస్తున్నాడు.


రావణుని సభకు ఈ ఐదుగురు సేనాధిపతులు ససైన్యముగా మరణించిన వృత్తాంతము చేరింది. ఈ దుర్ఘటనను ఆలకించగానే రావణుడు తన వీరకుమారుడైన అక్షయుని చూసాడు. యుద్ధము కొఱకు ఉత్కంఠితుడైన అక్షయకుమారుడు తండ్రి మనోభీష్టమును గ్రహించినవాడై, సువర్ణరథారూఢుడై కపీశ్వరుని బంధించుటకు బయలు దేరాడు. కాని రథములో ధనుర్భాణములు, చంద్రహాసము, శక్తి, తోమరము, గద మొదలైన ఆయుధములు, అస్త్రములు యథాస్థానమందు క్రమముగా ఉంచబడ్డాయి.


అక్షయకుమారుడు యుద్ధవీరుడైన హనుమంతుని పై ప్రచండ వేగముతో దాడి జరిపాడు. కాని భూధరాకారుడు, శ్రీమహా దేవాంశజుడైన హనుమంతుడు ఆకాశమార్గంలో పకెగిరినవాడై అక్షయునిరథము పైకి దూకాడు, ఆ తాకిడికి రథము, అశ్వములు, సారథి నశించారు. అక్షయకుమారుడు రథమునుండి దూకినవాడై ఆంజనేయునిపై అస్త్రములను ప్రయోగించడం ఆరంభిచాడు. అప్పుడు హనుమ ఆకాసానికి ఎగరగా అక్షయుడు వెంటబడ్డాడు. ఆకాశములో పవనకుమారుడు అక్షయకుమారుని రెండు కాళ్ళను పట్టుకొని గిరగిర త్రిప్పి భూమిపై పడేసాడు. అంతెత్తు నుండి క్రిందకు పడిన అసుర రాజు యొక్క ప్రాణప్రియపుత్రుని శరీరము తునాతునుకలయ్యింది. ఆ మహావీరుని ప్రాణము అనంత వాయువులో కలసిపోయింది. 


హనుమంతునిచే అక్షయకుమారుడు మరణించిన సమయంలో నక్షత్రమండలంలో విహరిస్తున్న మహర్షులు, యక్షులు, నాగులు, ఇంద్రాది దేవతలు ఆ ప్రదేశమునకు వచ్చి విస్మయముతో మహా తేజసంపన్నుడు, మహా కాలస్వరూపుడైన శ్రీరుద్రాంశజుని దర్శించి అనేక విధాల స్తుతించారు.  శ్రీ పవనకుమారుడు మరల యుద్ధము కొఱకు నిరీక్షింపసాగాడు.


No comments:

Post a Comment