Thursday 9 December 2021

శ్రీ హనుమద్భాగవతము (97)



సీతా దేవి ఇట్లా ప్రాణములను అర్పించుటకు సిద్ధమగుటను చుసి సూక్ష్మరూపుడైన పవనపుత్రుడు అత్యంత మధుర స్వరముతో ఇట్లా పలకడం ఆరంభించాడు. "ప్రఖ్యాతమైన ఇక్ష్వాకువంశములో ప్రభవించిన దశరథుడను చక్రవర్తి మహాప్రతాపవంతుడు, ధర్మాత్ముడు; ఆయనకు శుభలక్షణ సంపన్నులు, దైవసమానులు, త్రైలోక్యవిఖ్యాతులు నైన శ్రీరామలక్ష్మణభరతశతృఘ్నులనే నలుగురు కుమారులు కలరు. అగ్రజుడైన శ్రీరాముడు తన ప్రాణాధిక ప్రియురాలు, సహధర్మచారిణి యైన జనక రాజపుత్రికతోనూ, తన అనుజుడైన లక్ష్మణునితోనూ తండ్రి ఆజ్ఞను పాలించుటకు రాజ్య త్యాగ మొనరించి అరణ్యమునకు వెళ్ళాడు. వారు మహర్షులను, మౌని వర్యులను దర్శించుచు దండకారణ్యమును చేరారు. కరుణావతారుడైన శ్రీరామచంద్రుడు గౌతమీ నదీతటముపై గల పంచవటి అనే ఆశ్రమములో నివసింపసాగింది. శ్రీ రామలక్ష్మణులు ఆశ్రమమునకు దూరముగా ఉన్న సమయములో దుష్టుడు, లంకాధిపతి అయిన దశాననుడు మోసంగా సీతాసాధ్విని అపహరించుకొనిపోయాడు. ఆశ్రమమునకు తిరిగివచ్చి సీతను కనుగొనని వాడై శ్రీరామచంద్రుడు శోకసంతుప్తుడయ్యాడు. లక్ష్మణునితో కలసి సీతను వెతుకుతూ దుఃఖతుడైన శ్రీ రామచంద్రుడు అరణ్యమార్గ మధ్యములో జటాయువును అనుగ్రహించి, ఋష్యమూక పర్వత ప్రాంతమున కేతెంచాడు. ఆ ప్రదేశములో ఆంజనేయునితో సమాగము జరిగింది. వానరచక్రవర్తియైన సుగ్రీవునకు, శ్రీరామచంద్రునకు మైత్రి కుదిరింది. అగ్రజుడైన వాలి వైరముతో సుగ్రీవుని రాజ్యమునుండి వెడలగొట్టాడు. 

దీర్ఘ బాహుడైన శ్రీరామచంద్రుడు ఆ వాలిని ఒకే ఒక బాణముతో సంహరించాడు. సుమిత్రానందను డైన లక్ష్మణుడు సుగ్రీవుని కిష్కింధారాజ్యసింహాసనముపై అభిషిక్తునిగా చేసాడు. కిష్కింధాధిపతీ, వానర రాజునైన సుగ్రీవుడు విదేహరాజకుమారి యైన సీతా దేవిని వెదకుటకు కోటానుకోట్ల వానర భల్లూక వీరులను నాల్గు దిక్కులకు పంపాడు. నేను ఆ కపిరాజైన సుగ్రీవుడు పంపగా వచ్చిన సామాన్యవానరుడను. మార్గమధ్యంలో జటాయువు యొక్క అగ్రజుడైన సంపాతిని కలుసుకున్నాను, ఆయన విదేహ రాజకుమారి యొక్క నెలవు తెలిపాడు.


సంపాతి చెప్పిన మార్గముఅను అనుసరించి నేను సాగరముకు దాటి లంకను చేరాను. లంకలో అన్వేషించుచున్న నేను విభీషణుని కలుసుకున్నాను. విభీణుడు చెప్పిన ప్రకారము నేను జగజ్జననియైన సీతా దేవిని దర్శించాను. నా యాత్ర సఫలమైనది, కాని ఆ తల్లి దుఃఖమును చూడగానే నా ధైర్యము చలించుచున్నది.


ప్రాణారాధ్యుడైన శ్రీరామచంద్రుని భవ్యచరితము ఆలకించుచున్న సీతా దేవి ఆశ్చర్యమునకు హద్దులు లేకపోయింది. ఇది సత్యమా? లేక స్వప్నమును గాంచుచున్నానా? పరనిందను నేనెన్నడు చేసి ఎఱుగను. అయినచో నేనెట్లు స్నప్నమును గాంచగలను? ప్రస్ఫుటమైన మధుర వాక్యముల ఆలకించుచున్నాను, ఇది భ్రమ కాజాలదని సీతాదేవి మనస్సులో ఆలోచించుకొని ఇలా పలికింది. “అమృతమయమైన నా ప్రాణనాథుని శుభ చరితమును గానం ఒనరించిన మహానుభావుడు నా ఎదుటకు రావలసినదిగా కోరుచున్నాను.”

No comments:

Post a Comment