సీతామాత ఆదేశాన్ని ఆలకింపగానే శ్రీరామభక్తుడైన హనుమంతుడు మెల్లమెల్లగా వృక్షము నుండి దిగి అత్యంత వినయంగా తల్లి చరణకమలముల చెంత తన శిరస్సును ఉంచి నమస్కరించాడు.
అత్యంత కుటిల స్వభావము కలిగిన రాక్షస స్త్రీల నడుమ పతివియోగ దుఃఖముచే దుఃఖితురాలై కాలము గడుపుతున్న విదేహరాజకుమారి తన ఎదుట విద్యుత్పుంజసమానుడు, అత్యంతపింగళవర్ణుడు, పక్షిసదృశమైన ఆకారము కలవాడైన వానరుని గాంచి కంపించింది. వానరుని నేత్రములు తప్త సువర్ణమువలె మెరయుచున్నాయి. ఆ చిన్ని వానరమును చూసి నన్ను మోసముతో వశపరచుకొనుటకు మాయావి యైన రావణుడు ఇక్కడికి వచ్చాడేమోనని సీతాదేవి అనుమానించింది. తలను దించుకొని ఉన్న సీతామాత తన కష్టములకు వ్యాకులచిత్తయై దుఃఖింపనారంభించింది.
సీతా దేవి తలవంచుకొని దుఃఖించుట చూసిన అంజనీ నందనుడు వ్యాకులుడై ఇలా పలికాడు. “జననీ! నీకు ఎలాంటి శంక అవసరంలేదు. నేను కరుణామయుడైన శ్రీరాముని సాక్షిగా శపథం చేసి పలుకుతున్నాను. నేను ప్రభువైన శ్రీ రాముని దాసానుదాసుడను. వానరరాజైన సుగ్రీవుని మంత్రిని. వారు పంపగా నిన్ను వెదకుతూ ఈ ప్రదేశమునకు వచ్చాను. నా తండ్రి మహాపరాక్రమవంతుడైన వాయు దేవుడు”. తన ఎదుట అత్యంత శ్రద్ధతో తలవంచుకొని హస్తములు జోడించి నమస్కరిస్తూ నిలుచుండియున్న శ్రీ పవనాత్మజుని చూసి కొంత ఊరడిల్లి జానకి ఇలా పలికింది. “నీవు శ్రీరఘునాథునిదాసుడవని చెప్పుచున్నావు; కాని మానవులకు, మీకు ఎట్లు మైత్రి కుదిరింది.”
నమస్కరిస్తూ అత్యంత వినయపూర్వకంగా హనుమంతుడిలా ప్రత్యుత్తరం ఇచ్చాడు - 'తల్లీ! శబరి ఆదేశానుసారంగా రామానుజునితో కలిసి శ్రీ రామచంద్రుడు ఋష్య మూక పర్వత ప్రాంతమునకు వచ్చాడు. గిరిశిఖరము పై నున్న సుగ్రీవుడు ఈ మహాతేజస్సంపన్నులను చూసి వారి వివరములను తెలిసికొనవలసినదిగా నన్ను పంపాడు. ఒక బ్రాహ్మణుని వేషములో నేను స్వామిని సమీపించాను. భక్తపరాధీనుడు, నా దైవమైన నాశ్రీ రామచంద్రుడు నన్ను ఆంజనేయునిగా గుర్తించాడు. ఆయన చరణములపై బడి నేను లక్ష్మణసహితముగా భుజములపై ఎక్కించుకుని సుగ్రీవుని చెంతకు చేర్చాను. శ్రీరామునకు సుగ్రీవునకు మైత్రిని నెరిపాను. రాజ్యబహిష్కృతుడైన సుగ్రీవుడు శ్రీరామానుగ్రహము చేతనే మరల రాజ్యమును పొంది సుఖించుచున్నాడు. అతను పంపితేనే నేనిచటికి వచ్చాను. గురుతు కొఱకు ప్రభువు నాకీ రాజముద్రిక ఇచ్చాడు.
No comments:
Post a Comment