తదనంతరము శ్రీపవనపుత్రుడు సావధానుడై పలికాడు. ‘సోదరా ! విభీషణా ! నేను ప్రభువు యొక్క ఆదేశానుసారముగా నా తల్లిని వెదకుటకు వచ్చాను. సమయము పరిమితము. సూర్యోదయానంతరము వెలుగులో జనని చెంతకు పోవాలన్న అత్యంత కష్టమవుతుంది. అక్కడ సముద్రమునకు ఆవలితటముపై కోటాను కోట్ల వానర భల్లూక సేనలు అత్యంతోత్సాహముతో నాకొఱకై నిరీక్షించుచున్నారు. నేను స్వయముగా తల్లి దర్శనార్ధమై ఉత్కంఠత తోనున్నాను. నీవు కృపతో నా తల్లి దర్శనం ఎక్కడ కఅలుగుతుందో వివరించమని కోరుచున్నాను.
విభీషణుడు పలికాడు :
శ్రీరామభక్తాగ్రేసరా ! ఇచటికు ఆనతిదూరములో రాజ ప్రాసాదమునకు సమీపమున రావణునకు అత్యంతప్రియమైన అశోకవనము కలదు. ఆ వనము అనేకములైన సుగంధపుష్ప వృక్షములతోనూ, సుస్వాదుఫలములతో నిండిన వేలకొలది తరువులతోనూ నిండియున్నది. ఆ వనము భ్రమరముల ఝుంకారములతో, పక్షుల కిలకిలారవములతో ప్రతిధ్వనించుచుండును.
ఆ సుందర వాటిక యొక్క మధ్యభాగమున నిర్మలపూర్ణమైన సుందరసరోవరము కలదు. ఆ సరోవరతటముపై అసురకులపూజ్యుడైన శంకరభగవానుని విశాలరమణీయ మందిరము కలదు. ఆ ప్రాంతమును వేలకొలది రాక్షస స్త్రీలు శస్త్రములను ధరించి రక్షించుచుండెదరు. శివాలయమునకు ఆనతి దూరములో విశాల శాభాసమన్వితము, అత్యున్నతమైన అశోకవృక్షము కలదు. జననియైన సీత ఆ వృక్ష ఛాయలో ప్రభువుయొక్క వియోగముచే తపించుచు దుఃఖించుచున్నది. ఆమె సుదీర్ఘ కేశములు జటలుగా మారిపోయాయి. ఆహారమును విసర్జించిన కారణమున ఆమె శరీరము శుష్కించిపోయాయి. ఆమె శరీరముపై మాసిన వలువ తప్ప మరేమీ లేదు.
అత్యంత క్రూరలైన రాక్షసస్త్రీలు అహర్నిశలు ఆ సాధ్వీని భయపెడుతూ బెదిరించుచున్నారు. ఆ తల్లిని చేరుకొను అత్యంతకష్టము. నా భార్య నా జ్యేష్ఠ పుత్రిక అప్పుడప్పుడు తల్లిని దర్శించి ఊరడించి వస్తుంటారు. తల్లియొక్క ఆ కరుణ దశను తలచుకొనినంతనే నేను కంపిస్తాను. ఆమెకు ఒక వేయి మంది క్రూరరాక్షస స్త్రీలు శస్త్రములను ధరించి కాపున్నారు. వాయునందనా ! అత్యంత సావధానుడవై తల్లి చెంతకు వెళ్ళు. జగజ్జననియైన జానకీ దేవియొక్క యిట్టి కరుణాభరితమైన దశను ఆలకింపగానే కరుణాంతరంగుడైన అంజనీనందనునకు దుఃఖము పెల్లుబికింది. హనుమ విభీషణుని ఆలింగనమొనర్చుకొని ఇలా పలికాడు. “విభీషణా ! నీవు చింతింపవలసిన పనిలేదు. సర్వసమర్థుడైన ప్రభువు యొక్క దయవలన నేను జానకిని దరిస్తాను”.
హనుమ మరల సూక్ష్మరూపధారియై అశోక వాటిక దిక్కుగా తీవ్రగతితో పయనించాడు.
No comments:
Post a Comment