Monday 13 December 2021

శ్రీ హనుమద్భాగవతము (101)



తల్లి పల్కిన పల్కులను ఆలకించి సాక్షాత్తు శివస్వరూపుడు, పవనాత్మజుడైన శ్రీహనుమానుడు మందహాసము చేసి తన విశ్వరూపమును ప్రదర్శించాడు.


చూస్తుండగానే హనుమంతుడు ఇంతటి వాడంతై మేరువంతై గగనమంతై ఏదిగిపోయాడు. ప్రజ్వలితాగ్ని సదృశమైన తేజస్సు కలవాడు, విశ్వరూపుడు, అగ్ని సదృశమైన నేత్రములుగలవాడు, పంచశిరములు కలవాడు, ప్రతి ముఖమందు త్రినేత్రములు కలవాడు, వజ్రసమములైనకోరలు కలవాడు, వాడియైన నఖములు (గొర్లు) కలవాడు, విశాలకాయుడు మహాబలీ అయిన హనుమదీశ్వరుని విశ్వరూపమును చూసి సీతాదేవి పరమాశ్చర్యచకితురాలయ్యింది. దేవతలు ఆ విశ్వరూపునిట్లా ప్రార్థింపనారంభించారు.


శ్లో॥ వద్దే వానర నారసింహ ఖగరాట్, క్రోడాశ్వవక్రాంచితం 

నానాలంకరణం త్రిపంచనయనం, దేదీప్యమానం రుచా 

హస్తాభ్జైరసి ఖేట పుస్తక సుధాకుంభాంకుశాద్రీన్ హలం 

ఖట్వాఙ్గం మణిభూరుహంచ, దధతం సర్వారి గర్వాపహం,


(పరాశర సంహిత)


వాసర నృసింహ గరుడ సూకర అశ్వముఖములు కలవాడు, అనేకములైన అలంకారములు కలవాడు, దేదీప్యమానంగా ప్రకాశించుచున్నవాడు, ప్రతి ముఖమునందు మూడు నేత్రములు కలవాడు, పద్మములవంటి కరములందు ఖేటము (డాలు)ను, పుస్తకమును, అమృతకలశమును, అంకుశమును, పర్వతమును, నాగలిని, ఖట్వాంగమును, (శివునివింటిని), మణులను, వృక్షమును ధరించినవాడు, వైరులందరి - గర్వమును హరించినవాడైన హనుమంతునకు నమస్కరించుచున్నాను.


విశ్వరూపమును ధరించి హనుమదీశ్వరుడు సీతా దేవికి నమస్కరించి ఇలా పలికాడు. “జననీ! నేను వన పర్వత తటాకలతో యుక్తమైన ఈ లంక నగరాన్ని రావణునితో పాటు పెకలించుకొని మరలిపోగలవాడను; కావున నీవు శంకింపవలదు. శ్రీరాముని దండులో నన్ను మించిన వారు అసంఖ్యాకముగా ఉన్నారు. శ్రీరామచంద్రుని కృపా విశేషముచే అల్పకీటకమైనను గరుత్మంతుని మ్రింగగలదు.”


No comments:

Post a Comment