Thursday 30 December 2021

శ్రీ హనుమద్భాగవతము (116)



బలబుద్ధినిధానుడైన హనుమానుని ఉద్దేశ్యము పరిపూర్ణమయ్యింది. ఆయన తన ఆకారాన్ని తగ్గించుకొనగానే అసురులు చేసిన బంధనాలు జారాయి. శ్రీ పవనకుమారుడు బంధవిముక్తుడై తన బృహద్రూపమును ధరించాడు. ఆయన మండుతున్న తన వాలమును గిరగిర త్రిప్పనారంభించాడు. వాలముతో రాక్షసులను మోదుచుండగా ఆ హఠాత్పరిణామమునకు వారు ఆశ్చర్యముతో భయభ్రాంతులైరి, శ్రీహనుమంతుని వాలాఘాతము వజ్రఘాత సదృశముగా వారికి తోచింది. బాలకులు, యువతీయువకులు, వృద్ధులైన రాక్షసులందఱు భయముతో పారిపోవసాగారు. కాని వారెచ్చోటకు పరిగెత్తినా అచ్చోటకు వారిని ప్రజ్వలిస్తూ వాలము వెంటాడి మోదనారంభించింది. అగ్నిజ్వాలలలో చిక్కి అసురులు మరణింపసాగారు. ఇట్లు ఆ ప్రదేశమందున్న రాక్షసులనందరిని సంహరించి శ్రీహనుమంతుడు లంకానగరములో గల ఎత్తయిన అట్టాలిక పైకెగిరాడు.


శ్రీహనుమంతుని వాలమునకు నిప్పంటించిన విషయమును కొందఱు రాక్షస స్త్రీలు పరుగుపరుగున సీతకడకు పోయి పలికారు. “జానకీ! నీతో మాటలాడిన వానరమును బంధించి అవమానపరుస్తూ లంకానగరమంతా త్రిప్పి వాని వాలమునకు నిప్పుబెట్టారు.”


ఈ వృత్తాంతమును ఆలకించగానే సీతాదేవి కంపించింది. ఆమె తల ఎత్తి చూడగా లంకానగరము అగ్నిజ్వాలలతో మండుతున్నది. ఆమె వ్యాకులచిత్తయై అగ్ని దేవునిట్లు ప్రార్థించింది. “అగ్ని దేవా ! నేను నా ప్రాణనాథునకు సేవకురాలనైతే, నా పాతివ్రత్యము తపము నున్నచో పవనపుత్రుడగు శ్రీహనుమంతునకు నీవు శీతలత్వమును ప్రసాదింతువుగాక! " పతివ్రతాశక్తి అతులనీయము, సాధ్వి తలంచినచో సకలసృష్టి స్తంభించును. సీతా దేవి పతివ్రతి మాత్రమే కాక సకలసృష్టికి అధిష్ఠాత్రి, జగజ్జనని, మూలప్రకృతి, ఈశ్వరి. ఆమె ఇట్లు ప్రార్థించగానే అగ్ని దేవుడు శ్రీ హనుమంతుని యెడల శీతలత్వము ధరించాడు. అగ్నిశిఖలు ప్రదక్షిణం ఒనరించుచున్నట్లు శ్రీహనుమంతునకు గోచరించగా ఆశ్చర్యచకితుడై ఇట్లా ఆలోచించాడు. ఆహా! అగ్ని యొక్క గుణము జ్వలించుట. అగ్నిస్పర్శచే గొప్ప భవనములే బూడిద అవుచున్నవి. కాని నా కెట్టి తాపము కలుగకపోగా చల్లదనమును అనుభవించుచుంటిని. నిశ్చయంగా ఈ వైచిత్రమునకు సీతా దేవి అనుగ్రహమో, శ్రీరామచంద్రుని ప్రభావమో, నా తండ్రికి అగ్ని దేవునకు గల స్నేహమో కారణము కావచ్చునని తోస్తున్నది.

No comments:

Post a Comment