Friday 17 December 2021

శ్రీ హనుమద్భాగవతము (105)

 


విశాలమైన అసురసైనము నశించుట రావణునకు తెలిసింది. అందులకు అతడు ఆశ్చర్యచకితుడయ్యాడు. అప్పుడు రావణుడు తన మంత్రియైన ప్రహస్తుని కుమారుడైన జంబు మాలిని వానరుని బంధించి తేవలసినదిగా ఆజ్ఞాపించాడు. జంబు మాలి విశాలకాయుడు, మహా క్రోధి, యుద్ధములో దుర్జయుడు. అతడు అసుర సైన్యాన్ని తోడ్కొని అశోకవనమునకు వెళ్ళాడు. చైత్యప్రాసాదభంజకుడైన హనుమంతుడు ఒక విశాలద్వారముపై నిలుచుంని ఉన్నాడు. అసురవీరులు తనను సమీపించుట చూసి, ప్రసన్నతాపూర్వకముగా గర్జించాడు. జంబుమాలి పవన పుత్రునిపై దివ్యాస్త్రములను ప్రయోగించాడు. వజ్రశరీరుడైన హనుమంతుడు చలింపక ముష్టిఘాతముచే జంబుమాలిని సంహరించాడు. తదనంతరము అసుర సైన్యాన్ని లోహ స్తంభముచే మోది సంహరించాడు.

 

ప్రహస్తకుమారుడైన జంబుమాలి, అతని కింకరులు మరణించుట రావణునకు తెలిసింది. రావణుని ఆశ్చర్యమునకు అంతులేదు. వెంటనే అతడు మహాబలవంతులు, దనుర్దారులు, అస్త్రవేత్తలందు శ్రేష్ఠులైన ఏడుగురు మంత్రి పుత్రులను ససైన్యముగా హనుమంతుని పైకి పంపాడు. ఆ ఏడుగురు మహావీరులు శస్త్ర సమన్వితములైన తమతమ సైన్యములతో కూడి ఒంటరివాడైన రుద్రాంశుని నిర్జించుటకు బయలు దేరారు. పరాక్రమవంతులైన ఆ మంత్రికుమారులు సువర్ణ ధనుష్టంకారం ఒనరించుచు హర్షయుక్తులై, ఉత్సాహవంతులై రణరంగమునకు చేరారు. సూర్యసమాన తేజస్వియైన శ్రీ హనుమంతుడు ప్రచండమైన లోహ స్తంభాన్ని ధరించి అసుర సైన్యము కొరకు నిరీక్షించుచున్నాడు. రాక్షసులందఱు ఒక్కుమ్మడిగా కొఱకు నిరీక్షించి హనుమంతునిపై బాణములను వర్షింపనారంభించారు. యుద్ధ ప్రియుడు, పరాక్రమవంతుడైన హనుమంతుడు తీక్షణమైన వారి శరాఘాతముల నుండి తన్ను తాను రక్షించుకుంటూ, భయంకర గర్జనములచే భయపెడుతూ వారిని ఎదుర్కొన్నాడు. క్షణములో మంత్రికుమారులతో పాటు అసుర సైన్యములు నేలకూలాయి. శేషించిన వారు భయభ్రాంతులై పలాయనము చిత్తగించారు.

 

ఇప్పుడు రావణుడు భయము పొందాడు; కాని మనస్సును దిటము చేసుకుని తన కర్తవ్యాన్ని నిశ్చయించుకొని హనుమంతుని బంధించి తీసుకొని రమ్మని మహావీరులు, రణనిపుణులు, ధైర్యవంతులైన విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు అనే పేర్లు గల్గిన ఐదుగురు సేనాధిపతులను ఆజ్ఞాపించాడు.

 

దశకంఠుని ఆ ఐదుగురు సేనాధిపతులు తమ తమ సైన్యములతో అశోకవనమును చేరి హనుమంతునిపై దాడిచేసారు.    

No comments:

Post a Comment