క్రూరతముడైన దశముఖుని విషమయములు, బాణ సదృశములైన పరుష వాక్యములకు జానకీ దేవి కొంచమైనా చలించలేదు, భయపడలేదు. ఆమె తన ముందు ఒక గడ్డిపోచను పడవెసి తల దించుకొని ఇలా పలికింది. “అధముడవైన రాక్షసుడా ! నీ వేమి చేయదలచుకొంటివో దానిని వెంటనే చెయ్యి. నీవంటి పాపాత్మునికి లొంగుట కంటె మరణించుట మేలు. నిన్ను నీవు త్రైలోక్యవిజయుడవని తలంచుచున్నావు. ఓరీ ! నీచ శునకమా ! నాప్రాణనాథుడు లేని సమయమున నన్ను అపహరించి తెచ్చి నీ గృహములో అసహాయురాలనైన నా పై బింకములు పల్కుచున్నావు. శ్రీ రాఘవేంద్రుడు లంకలో అడుగిడునంతవఱకే నీవిట్టి వాచాలత్వమును చూపగలవు. త్వరలోనే నీ బంగారులంక అగ్నిలో కాలి బూడిద కాగలదు. నీవు నీ సకలపరివారముతో శ్రీరామచంద్రుని తీక్ష్ణశరములకు బలైతావు. శ్రీకోసలేంద్రుని శరవర్షముచే విదీర్ణుడవై నేల కొరిగినప్పుడు గాని ఆయన ప్రతాపము నీకు తెలియరాదు. ప్రభువు దూరముగా ఉన్నంతవరకే నీ విట్టి పిచ్చిమాటలను నీ ఇష్టానుసారంగా పలుతావు".
శ్రీరామవియోగం అనుభవించుచున్న సీతా దేవి పలికిన ఈ కఠోరవచనములును ఆలకింపగనే రావణుని నేత్రములు రక్త వర్ణములయ్యాయి. క్రోధోన్మత్తుడై ఆ అసురుడు వరనుండి ఖడ్గమును తీసి జనక నందినిని సంహరించుటకు సిద్ధము కాగా, పట్టమహిషియైన మండోదరి వాని కరమును పాట్టుకొని ఆపుతూ ప్రేమపూర్వకముగా ఇట్లు పలికాడు. “హృదయేశ్వరా! దుఃఖితురాలైన ఈ దీనురాలిని వదలివేయ్యి. ఈమెలో ఏమి కలదు? నిన్ను వరించుటకు దేవగంధర్వనాగాదులలో అధిక లావణ్యవతులైన స్త్రీలు ప్రతిక్షణము నిరీక్షించుచున్నారు”.
ఇట్లా రావణుని పాదములపైబడి మండోదరి ప్రార్థించగా రావణుడు క్రోధముతో ఇట్లా పలికాడు. “జానకీ ! నేటికి నిన్ను విడచుచున్నాను. కాని ఒక నెలదినములలో నీవు నన్ను అంగీకరించకపోతే నా చేతిలో నీ మరణము నిశ్చితమవుతుంది; కావున శీఘ్రముగా ఆలోచించుకొని నీ నిర్ణయమును తెలుపు”.
No comments:
Post a Comment