సోదరా ! ఆంజనేయా! అనుచు దుఃఖించుచు భరతుడు ఆయనను తన వక్షఃస్థలమున హత్తుకొనెను. పవనకుమారా ! నేను ప్రభువునకు సంబంధించిన ఏ కార్యమునకు కూడ పనికి రాని వాడనైతిని. పాపాత్ముడనైన నా వలననే ప్రభువు అనేక కష్టముల అనుభవింపవలసి వచ్చెను. నా వలననే లక్ష్మణుడు మూర్ఛితుడయ్యెను. ఇపుడు కూడ నేను శ్రీరామకార్యములో ఆలస్యమగుటకు కారణమైతినని శ్రీభరతుడు వాపోయెను.
ఆంజనేయుని సమాచారమును తెలిసికొని కౌసల్య, సుమిత్ర, వశిష్ఠుడు మొదలగువారు ఆ ప్రదేశమున కరుదెంచిరి. సుమిత్రా దేవి ఆంజనేయునితో నిట్లు బల్కెను. “ఆంజనేయా! శ్రీరామచంద్రునితో నామాటగా నిల్లు చెప్పుము. లక్ష్మణుడు తన కర్తవ్యమును పరిపాలించెను. ఇందులకు నేనెంత యో ప్రసన్న రాల నగుచున్నాను. సేవకుడు ప్రభుని సేవలో | ప్రాణము లను సహితము త్యాగ మొనరింపవలెను. లక్ష్మణుడు లేకున్నాను సీత లేని శ్రీ రామచంద్రుని ఆగమనమును నేను సహింపలేదు.
కౌసల్యా దేవి ఇట్లు పల్కెను. “పవనకుమారా! ఈమె చెప్పిన వాక్యములను శ్రీరామునితో చెప్పకుము. ఈమె శ్రీ రాముని తన ప్రాణములకంటె అధికముగా ప్రేమించెను, అందు వలన ఈమెకు శ్రీరాముడు తప్ప అన్యులెవరు గోచరింపరు. నీవు శ్రీరామునితో నా మాటగ ఇట్లు చెప్పుము. రామా ! నీవు అయోధ్యను వీడు సమయమున లక్ష్మణుని వెంటనిడుకొని వెళ్ళినట్లే తిరిగి వచ్చు సమయమున లక్ష్మణునితో కలసి రావలయును. లక్ష్మణుడు లేనిదే నీవు అయోధ్యకు రారాదు.” పవనాత్మజునితో కౌసల్యా దేవి మాటలాడుచున్న సమయములోనే సేనాపతి యొక్క ఆదేశానుసారముగా అయోధ్యా నగర విశాల సైన్యము లంకను ముట్టడించుటకు సమావేశమయ్యెను. సముద్రమువలె గోచరించుచున్న ఆ సైన్యమును గాంఛి ఆంజనేయస్వామి ఆశ్చర్యచకితుడయ్యెను.
సర్వసైన్యాధిపతి లంక పై దాడి వెడలుటకు అనుజ్ఞ ఒసంగవలసినదిగ ప్రార్థింపదొడంగెను. వాని ప్రార్థనను విని కులగురువైన వశిష్ఠ మహర్షి ఇట్లు పల్కెను: “చక్రవర్తి యొక్క సైన్యము ఇట్లే ఉండవలెను. ధర్మోల్లంఘనము జరుగరాదు. ఈ పరిస్థితులలో శత్రుఘ్నుడైనను ఆ ప్రదేశము వెడలుట ఉచితముకాదు. ఇక ఈ సైన్యము మాట ఏమి? శ్రీ రఘునందనుడే ఒంటరిగా అవనిపైగల రాక్షసులను అందరిని సంహరించుటలో సర్వసమర్థుడు.