Monday 7 February 2022

శ్రీ హనుమద్భాగవతము (153)



అయినా శ్రీఆంజనేయునకు పూర్ణమైన తృప్తి కలుగలేదు. ఆయన వనములకు, పర్వతములకు శీఘ్రముగా పోవుచు, వచ్చుచు శిలలను వృక్షములను అసంఖ్యాకములుగా తెచ్చుచుండెను. అందఱిని ప్రోత్సహించుచుండెను. వానర భల్లూక వీలందఱు శ్రీమారుతాత్మజుడు తమ చెంతనే ఉన్నాడని భావించుచుండిరి. నాల్గవదినమున ఇరువది రెండు యోజనముల వారధి నిర్మింపబడెను.


బుద్ధిలో, తేజస్సులో, శక్తిలో, పరాక్రమములో, అగ్రగణ్యుడైన శ్రీపవనకుమారుడు వానర సమూహములను ప్రోత్సహించుచు ఇట్లు పలికెను. “పరమభాగ్యవంతులైన వానర భల్లూక వీరులారా ! జగన్నియంత అయిన శ్రీరామ చంద్రుని యొక్క, నిఖిలభువనములకు జననియైన జానకీ దేవి యొక్క కార్యములో నిమిత్తమాత్రులగుట నిశ్చయముగా మీ సౌభాగ్యము. లేనిచో భగవంతుడైన శ్రీ రామచంద్రుడు తన సంకల్పమాత్రముననే సకలరాక్షసులను సంహరింపగలడు. ప్రభు చరణ సేవయందు మనయందరి జీవనములు సుజీవనములగుచున్నవి, జన్మములు సఫలములగుచున్నవి. ఇట్టి అదృష్టము ఇంద్రాది దేవతలకైనను దుర్లభమని తెలిసికొనుడు. నేటి వరకు ఇరువది మూడు యోజనముల దూరము సేతునిర్మాణము మిగిలియున్నది. కావున నేటితో మిగిలిన సేతువును లంకా నగరమువఱకు పూర్తి చేయవలసినది.


గోవర్ధనగిరి


‘జయ శ్రీరాం, జయ శ్రీసీతారాం’ అనుచు కోటాను కోట్ల వానర భల్లూక వీరులందఱు గర్జించిరి. శ్రీ ఆంజనేయుడు సింహనాదం ఒనరించుచు శ్రీరామచంద్రుని దివ్యనామములను కీర్తించుచు విశాలములైన పర్వతములను తెచ్చుటకు బయలుదేరెను. దశదిశయందుగల పర్వతములన్నియు సేతునిర్మాణమునకు వినియోగింపబడెను. శ్రీ పవనకుమారుడు ఉత్తరదిశగా పర్వతములను అన్వేషించుచు బయలు దేరేను. సప్త యోజనములు విస్తరించియున్న ఒక పర్వతమును ఆయన గాంచెను. ఆ పర్వతనామమే 'గోవర్ధనగిరి', భగవానుడైన శ్రీరామచంద్రుని అవతారసమయములో దేవగణములన్నియు దుర్లభములు, మంగళమయములైన ఆయన దర్శించుటకు, ఆయనను సేవించుటకు అవనిపైకి దిగి వచ్చెను. అపుడే శ్రీగోవర్ధనశిఖరము కూడ గోలోకమునుండి అవని పైకి వచ్చెను. 


No comments:

Post a Comment