ఆంజనేయుడు ప్రళయంకరమైన తన స్వరూపమును ధరించుటకు సంసిద్ధుడయ్యెను; కాని లీలామానుషవిగ్రహుడైన శ్రీరఘునాయకుడు మనప్యోచితమగు ఆచరణము ఒనరింపవలయును. రుద్రావతారుని ఈ ఆవేశమును చూచి శ్రీరాముడు చింతించెను. విభీషణుని ప్రేరణచే మహాబుద్ధిమంతుడైన జాంబవంతుడు ఇట్లు పల్కెను. “పవనకుమారా! నిస్సందేహముగా నీవు సర్వము ఒనరింపగలవు. నీకేదీ అసంభవము కాదు. కాని నీవు ఇట్లు చేయవలసిన పనిలేదు. మొదట మహావైద్యుడైన సుషేణుని తోడ్కొనిరమ్ము. ఆయన చేయు చికిత్సచే నిశ్చయముగా లక్ష్మణుడు రక్షింపబడగలడు. సుషేణుడు అఱుదెంచి లక్ష్మణుని పరీక్షించెను. తగిలిన దెబ్బ బలమైనదని సూర్యోదయమునకు పూర్వమే సంజీవనిని తెచ్చినచో లక్ష్మణున కెట్టి ఆపద సంభవింపదనీ సుషేణుడు పల్కెను. తన ఎదుట విచార ముద్రలో నిలబడియున్న పవనకుమారుని గాంచి సుషేణుడు ఇట్లు పల్కెను. “మహాపరాక్రమవంతుడా! ఆంజనేయా ! ఈ మహాకార్యము నీవలననే సంపన్నము కావలయును, నీవు శీఘ్రమే హిమాలయ పర్వత ప్రాంతమునకు వెళ్ళు, అత్యంతోన్నతములైన ఆ పర్వతపంక్తులలో ఉన్నతోన్నతముగా కైలాసశిఖరము, వృషభ శిఖరము విరాజిల్లుచున్నవి. ఆ రెండు శిఖరముల మధ్య అత్యంతదీప్తివంతమైన ద్రోణశిఖరమును దర్శింపగలవు. ఆ పర్వతరాజము సకలౌషధులకు ఆలవాలము - సంజీవని, విశల్యకరణి, సువర్ణకరణి, సంధాని అను మహౌషధులు సదా ప్రకాశించుచుండును. మహావీరా ! ఆ ఓషధులను శీఘ్రమే తెచ్చి లక్ష్మణునకు ప్రాణదాన ఒనరింపుము. వీరవరా ! ఓషధులు సూర్యోదయమునకు పూర్వమే ప్రయోగింపవలయును, సూర్యోదయమైన పిమ్మట సుమిత్రానందనుని రక్షించుటసంభవము కాగలదు.”
'జయ శ్రీరాం’ అని గర్జించి శ్రీ రాఘవేంద్రుని చరణారవిందములకు నమస్కరించి అంజనానందనుడు వాయు వేగముతో ఆకాశమునకు ఎగిరెను. క్షణములో హిమాలయ పర్వత పంక్తులను చేరెను. ఆ ప్రాంతములో అతి సుందరమైన ఒక తపోవనమును గాంచెను. యోజనవిస్తృతమైన ఆ తపోవనములో మధుర ఫల భరితమైన అనేక వృక్షములు కలవు. ఆశ్రమములో ఒక మునివర్యుడు శంకరుని పూజించుచుండెను.
ఆంజనేయునకు దప్పిక కల్గెను. ఈ ఆశ్రమములో జలములను స్వీకరించి ద్రోణగిరికి పయనము కావలయునని సంకల్పించి మహర్షికి నమస్కరించి ఇట్లు పల్కెను. “మునివరా! భగవంతుడైన శ్రీ రామచంద్రుని దూతను. పవన పుత్రుడనైన ఆంజనేయుడను. తమకు నమస్కరించుచున్నాను. శ్రీరామచంద్రుని కార్యార్థినై పోవుచున్నాను. దప్పికగొని ఉన్నాను. జలాశయమెచ్చట ఉండునో తెలుపవలసినదిగా ప్రార్థించుచున్నాను." -
No comments:
Post a Comment