Monday 21 February 2022

శ్రీ హనుమద్భాగవతము (167)



రథము, సారథి, అశ్వములు తుదకు తాను కూడా ఆ పర్వత శిఖరము క్రిందపడి నశించియుండేడివాడు. ఆంజనేయుడు ఎన్ని పర్యాయములు దంద్వయుద్ధమునకై మేఘనాథుని ఆహ్వానించినను రావణపుత్రుడు దూరముగా తొలగి యుద్ధము చేయుచుండెను. పవనకుమారునితో యుద్ధమొనరించుట మృత్యువును వరించుటకన్న తక్కువేమి కాదని వానికి బాగా తెలుసు. 


మేఘనాథునకు, లక్ష్మణునకు భయంకరమైన యుద్ధం ఆరంభమయ్యెను. ఇంద్రజిత్తు సౌమిత్రిపై అనేక శస్త్రాస్త్రములను ప్రయోగించెను; కాని అవి అన్నియు వ్యర్ధములయ్యెను. అసురుడు\ తుదకు అవినీతికరమైన యుద్ధమునకు పాల్పడెను.


శ్రీరామానుజుడు కోపోద్దీపితమానసుడై తీవ్రము బాణములను ప్రయోగించి వాని రథమును చూర్ణమొనరించి సారథిని సంహరించెను.


రావణకుమారుడు క్రోధోన్మత్తుడై లక్ష్మణుని సంహరింపవలెనని అనేక విధముల అధర్మయుద్ధము చేయ యత్నించెను. వాని ప్రయత్నముల నన్నిటిని లక్ష్మణుడు విఫలమొనరించి అసంఖ్యాకమైన తీక్ష బాణములచే వానిని బాధించెను. మేఘనాథుని ధైర్యము సడలెను. తన్ను తాను రక్షించుకొనుటకు మఱియొక మార్గమును గానక క్రూరుడైన ఆ అసురుడు సౌమిత్రిఫై బ్రహ్మప్రదత్తమైన అమోఘమైన శక్తిని ప్రయోగించెను. అత్యంత తీవ్రగతితో ఆ మహాశక్తి బయలు దేరి సుమిత్రానందనుని వక్షస్థలమును చీల్చి అదృశ్యమయ్యెను. రక్తధారలు ప్రవహించుచుండగా లక్ష్మణుడు అచేతనుడై పృథ్విపై పడెను.


లక్ష్మణుడు మూర్ఛిల్లగానే మేఘనాథుడు లక్ష్మణుని అపహరించుటకు బయలుదేరెను. ఆ అసురుడు, బలవంతులైన పెక్కండ్రు రాక్షసులు లక్ష్మణుని కదల్చుటకు తమ శక్తియుక్తులతో ప్రయత్నించిరి; కానీ ఆదిశేషుని అవతారమైన లక్ష్మణుని వారు ఇసుమంతైనను కదల్చలేకపోయిరి, హతాశులై వారు మరలిపోయిరి.

No comments:

Post a Comment