Sunday, 27 February 2022

శ్రీ హనుమద్భాగవతము (173)



శ్రీరామచంద్రునకు జయము పల్కుచు ఆంజనేయుడు సచేతనుడయ్యెను. తన సమక్షమున ఉన్న భరతుని గాంచి తాను శ్రీరామచంద్రుని చెంతకు చేరితినని భావించెను. వెంటనే కపీశ్వరుడు భరతుని చరణారవిందములకు ప్రణామము ఒనరించి 'ప్రభూ! నేనెచ్చట ఉన్నా'నని అడిగెను. ఆనంద బాష్పములను తుడుచుకొనుచు భరతుడిట్లు పల్కెను. “మహా భాగా ! ఇది ఆయోధ్య! నీ పరిచయ భాగ్యమును గల్గింపుము.” 


ఆహా ఇది అయోధ్యయా! నేను పరమపావనమైన స్వామి యొక్క నగరమును చేరితినా ! నిత్యము నా ప్రభువు గుణగానం ఒనరించు భరతుడవు నీవే అని నాకు తోచుచున్నదని ఆంజనేయుడు పల్కెను.


“అవును నాయనా! అధముడనైన ఆ భరతుడను నేనే అని దుఃఖించుచు ఈ పాపాత్ముని కారణముననే రామచంద్రుడు పదునాల్గు సంవత్సరములు అరణ్యవాసం ఒనరించుటకు వెడలిపోయెను. నా కారణము వలననే మా తండ్రి పరలోకగతుడయ్యెను. జనక రాజకుమారి అనేక కష్టములలను అనుభవింపవలసివచ్చెను. దురాత్ముడనైన ఆ భరతుడను నేనే. శ్రీరామభక్తా ! నేడు నీ దర్శనముచే పవిత్రుడనైతివి. నీ పరిచయమును తెలిపి నన్ను కృతార్థునిగా నొనరింపుము" అని పలికెను. 


మరల ఆంజనేయుడు భరతుని పాదములకు నమస్కరించి ఇట్లు పలికెను. "ప్రభూ! నేను శ్రీరామచంద్రుని దాసానదాసుడను; ఆంజనేయుడను. అంజనా దేవి నా తల్లి. దేవుడు నా తండ్రి. లంకాధిపతియైన రావణుడు జానకిని హరించి అశోక వాటికలో బంధించెను. ప్రభువు సముద్రము పై సేతునిర్మాణం ఒనరింపచేసి వానర భల్లూక సైన్యములతో లంకను చేరి యుద్ధమారంభించెను. నేడు మేఘనాథుడు ప్రయోగించిన శక్తిచే లక్ష్మణుడు మూర్ఛితుడయ్యెను. ఆయన కొఱకై సంజీవనిని తెచ్చుటకు నేను ద్రోణాచలమును చేరితిని. ఓషధులతో ప్రకాశించుచున్న ద్రోణాచలమును పెకలించి తెచ్చుచుంటిని. మార్గములో తమ దర్శనమగుట నా అదృష్టము. శ్రీరామచంద్రప్రభువు ఎల్లప్పుడు నీ గుణములను గానం ఒనరించుచుండును. నేడు నీ దర్శనముచే నేను కృతార్థుడనైతిని.


No comments:

Post a Comment