Sunday 20 February 2022

శ్రీ హనుమద్భాగవతము (166)



రావణుడు తెప్పరిల్లినవాడై మహావీరులైన వానరులపై దాడి చేయుచు వారిని వధింపసాగెను. అది చూచి శ్రీరాఘవేంద్రుడు రావణునితో తలపడుటకు బయలుదేరెను. భగవంతుడైన శ్రీరామునకు అనన్య సేవకుడైన పవనాత్మజుడు ప్రభువు కడకు వెడలి ఇట్లు నివేదించెను.


శ్లో॥ మమ పృష్ఠం సమారుహ్య రాక్షసం శాస్తు మర్హసి । 

విష్ణుర్యథా గరుత్మంతమారుహ్యామర వైరిణమ్ | (వా. రా. 6.59.124)


ప్రభూ ! భగవంతుడైన విష్ణువు గరుత్మంతుని భుజస్కంధములపై ఎక్కి దైత్యులను సంహరించినట్లు నీవు నా భుజములపై అధిరోహించి ఈ రాక్షసులను వధింపుము.


ఆంజనేయుని ప్రార్థనను మన్నించి శ్రీరామచంద్రుడు ఆయన భుజస్కంధముపై ఆసీనుడయ్యెను. లక్ష్మణుడు కూడా ఆంజనేయుని భుజముపై ఆశీనుడయ్యెను. ఇట్లు మహావీరుడైన ఆంజనేయుడు యుద్ధభూమియందు ప్రముఖపాత్ర వహించెను. ఎందఱో రాక్షసులు ఆంజనేయునిచే సంహరింపబడి ముక్తులైరి. యుద్ధభూమిలో రాక్షసులకు హనుమంతుడు ప్రళయకాల రుద్రునివలె గోచరించెను, కాని ఆయన హృదయములో రాక్షసులపై అపారమైన కరుణ కలదు. ఆయన కొందఱు రాక్షసులను ప్రభువు సమ్ముఖమునకు గొని తెచ్చి సంహరించుచుండెను. అట్లు సంభవము కానిచో శ్రీ రామనామ ముచ్చరించుచు వారిని వధించుచుండెను. శ్రీరామదర్శనముచే శ్రీరామనామ శ్రవణముచే పవిత్రులై రక్కసులు అక్షయము, సుఖశాంతినికేతనమైన పరంధామమునకు చేరుచుండిరి.


సంజీవనిని తెచ్చుట


అసురులకు, వానరులకు సంగ్రామము భయంకరముగా సాగుచుండెను, రణరంగములో మేఘనాథుడు ప్రవేశించెను. లక్ష్మణుడు ధనుర్భాణములను ధరించి వానిని నిలువరించెను. పరస్పరము ఘోరసంగ్రామ మొనరింపసాగిరి. ఇంద్రజిత్తు బాణములను వర్షమువలె కురిపించి వానర భల్లూక వీరులను అధీరులుగా ఒనరింపసాగెను. మేఘనాథుని గర్జనములను విని, పరాక్రమమును గాంచి ఆంజనేయుడు వానిపై విశాలమైన ఒక పర్వ శిఖరమును ప్రయోగించెను. ప్రాణములను రక్షించుకొనుటకు ఆ నిశాచరుడు రథసహితముగా ఆకాశమునకు ఎగిరెను. 

No comments:

Post a Comment