Tuesday 22 February 2022

శ్రీ హనుమద్భాగవతము (168)



అదే సమయములో ఆంజనేయుడు మఱియొక వైపు రాక్షససంహారము చేయుటలో సంలగ్నుడైయుండెను. లక్ష్మణుడు మూర్ఛిల్లెననెడివార్త తెలియగానే ఆంజనేయుడు సాక్షాత్తుగా యమునివలె భయంకరుడయ్యెను. ఆయన నేత్రములనుండి అగ్నిజ్వాలలు బయల్వెడలెను, క్షణములో ఆ అసుర సమూహములను సర్వనాశనమొనరించెను. మిగిలినవారు ప్రాణములను అర చేతబట్టుకొని పారిపోయిరి. ఆంజనేయుడు పరుగున లక్ష్మణుని చేరి ఆయనను తనభుజములపైకి ఎత్తుకొనెను. సుందరుడైన సుమిత్రానందనుని ముఖారవిందము మూర్ఛచే మలినమగుట గాంచి వజ్రాంగబలి నేత్రములు అశ్రుపూరితములయ్యెను.


సంధ్యాసమయమయ్యెను. రాక్షస వానర వీరులు యుద్ధము చాలించిరి. శ్రీరఘునందనుడు లక్ష్మణుని గూర్చి ఆలోచించుచుండగానే ఆంజనేయుడు లక్ష్మణుని తన భుజములు పై నిడుకొని ఆ ప్రదేశమును చేరెను. మూర్ఛితుడైయున్న సుమిత్రాకుమారుని ప్రభువు సమక్షములో పరుండబెట్టెను. శ్రీరామానుజుడు మూర్ఛితుడగుట చూచి శ్రీ రామచంద్రుడు హృదయవిదారకముగా దుఃఖింపసాగెను. వానర భల్లూక వీరులందఱు కరుణామయమైన ఆ దృశ్యమును గాంచి చింతామగ్నులైరి.


శ్రీరామచంద్రుడే ధైర్యమును వదలి చింతించుట చూచిన పవనకుమారునినేత్రములు సజలములయ్యెను; కాని ఈ విషమపరిస్థితిలో అందరిని ఊరడింపగల బాధ్యత ఆంజనేయుని పైనుండెను. కావున ఆ మహానుభావుడు మనస్సును దృఢం ఒనర్చుకొని అందఱిని ఉత్సాహపరచుచు ఇట్లు పల్కెను. "ప్రభూ ! నేనుండగా మీరు లక్ష్మణుని కొఱకై చింతింప పనిలేదు. నీ ఆజ్ఞ ఉన్నచో స్వర్గమునుండి అమృతమును తెచ్చెదను. సుమిత్రానందనుని రక్షించుటకు నాగ లోకమునకైనను వెడలి అమృతమును తెచ్చి లక్ష్మణుని పునర్జీవితుని చేసెదను. రామచంద్రా ! నీ అనుజ్ఞ యైనచో ధ్వంస మొనరించెదను. ఇక లక్ష్మణుని కొఱకై మీ ఆందోళన సమసిపోగలదు. సర్వప్రాణులు మృత్యు భయమునుండి విముక్తులయ్యెదరు.

No comments:

Post a Comment