Thursday 3 February 2022

శ్రీ హనుమద్భాగవతము (149)



నేను సంకల్ప మాత్రముననే లోకపాలకులతో పాటు సమస్త విశ్వమును లయమొనరించి మరల సృష్టింపగలను. అసురులనందఱిని లక్ష్మణుడు ఒక్క క్షణములో సంహరింపగలడు. కావున నీవు చింతింపవలసిన పనిలేదు. వెంటనే విభీషణుని తోడ్కొనిరమ్ము.”


భక్తానుగ్రహవిగ్రహుడైన శ్రీ రామచంద్రుని మధుర వచనములను ఆలకించిన పవననందనుని ఆనందమునకు మేర లేకపోయెను. ఆయన శరీరము పులకించెను. నేత్రములు ప్రేమా శ్రువులతో నిండెను.


భక్త వత్సలుడైన శ్రీరామదంద్రునకు 'జయమగుగాక ' యని శ్రీ ఆంజనేయుడు సింహనాద మొనరించెను. అంగదాది వానరులను తోడ్కొని ఉల్లాసపూర్వకముగా ఎగిరినవాడై శ్రీ ఆంజనేయుడు విభీషణుని చెంతకు వెళ్ళి అతనిని ఆదర్శపూర్వకముగా ప్రభువు సమీపమునకు తోడ్కొనిని వచ్చెను. జటాజూటములను ధరించి శ్యామగౌరవర్ణముతో ప్రకాశించు శ్రీరామలక్ష్మణుల అలౌకిక సౌందర్యమును కన్నులారా విభీషణుడు దర్శించెను. కొన్ని క్షణముల అట్టి ఆనందస్థితిలో నుండి విభీషణుడు ప్రభువు పాదములపై పడి సాష్టాంగదండప్రణామముల ఒనరించుచు ఇట్లు ప్రార్థించెను. “పంకజలోచనా! శ్రీమన్నారాయణా! శరణు, శరణు. ప్రభూ! నీ సహధర్మచారిణియైన సీతా మాతను హరించినవాడు, రాక్షసకులోత్పన్నుడు, దుష్టుడైన దశకంఠుని కనిష్ఠ సోదరుడ నైన విభీషణుడను. నేను అత్యంత తామస ప్రవృత్తి గల్గిన రాక్షసుడను, అధముడను. విదేహ రాజకుమారియైన సీతను నీకు సమర్పించి శరణు వేడుమని నా అగ్రజుడైన రాక్షసరాజు అనేక విధముల ప్రార్థించితిని. కాని అతడు కాలవశుడై నాపై కోపించెను. దూషించి నన్ను కాలితో తన్నెను. దేవాది దేవా! నేను నీ దివ్యచరణావిందములను స్మరించినవాడనై నేను సంసార బంధముల నుండి ముక్తుడనగుటకు ముముక్షువునై దారా పుత్రాదులను లంకలో వదలి మంత్రులతో కలసి భువనపావనములైన నీ చరణారవిందములను శరణుజొచ్చితిని. కరుణానిధానుడా! నీవు అధముడనైన నాపై కృపా దృక్కులను ప్రసరింపజేసి జన్మమును సఫలమొనరింపుము. నీ దివ్య పాదారవిందముల నీడలో " నాకు ఆశ్రయము నిమ్ము.”


No comments:

Post a Comment