ఆంజనేయుని రణకౌశలమును గుఱించి, పరాక్రమమును గుఱించి ఇంద్రజిత్తునకు బాగుగా తెలియును. ఆంజనేయుడున్న భయము చెందినవాడై మేఘనాథుడు ఆ మహావీరునితో తలపడకుండ దూరముగా ఉండి యుద్ధమొనరించుట ఆరంభించెను.
ఇంద్రజిత్తు వానర సైన్యమును సంహరించుట ఆరంభించెను. వాని బాణవర్షమునకు సుగ్రీవుడు, అంగదుడు, నీలుడు, శరభుడు, గంధమాదనుడు, జాంబవంతుడు, సుషేణుడు, మైందుడు, వేగదర్శనుడు, నలుడు, జ్యోతిర్ముఖుడు, దివిదుడు మున్నగు వానరవీరులందఱు క్షతగాత్రులైరి. మేఘనాథుడు 'శ్రీరామలక్ష్మణులపై బ్రహ్మాస్త్రమును అభిమంత్రించి ప్రయోగింపగా వారిర్వురు మూర్ఛితులైరి.
క్షతగాత్రులై పడియున్న వానర సైన్యమును గాంచి విహ్వలుడై విభీషణుడు జాంబవంతుని సమీపించెను. మేఘనాథుని శరములచే విదీర్ణుడై పడియున్న జాంబవంతుని చూసి ఇతడు జీవించియున్నాడా లేదా అను సంశయము కలుగగా హస్తముతో అతని విశాలమైన కాయమును నిమురుచు కుశలమును అడిగెను. అపుడు జాంబవంతుడు ఇట్లు బల్కెను. “రాక్షస రాజా! నా శరీరమంతయు ఇంద్రజిత్తుని శరములచే విదీర్ణమైనది. కన్ను తెరచి నేను చూడలేక పోవుచున్నాను. కేవలము నీ స్వరమును విని నీవు విభీషణుడువని గుర్తించితిని. అంజనీనందనుడగు హనుమంతుడు సజీవముగా ఉన్నాడో లేదో తెల్పుము.
జాంబవంతుని ప్రశ్న విని పరమాశ్చర్యచకితుడై విభీషణుడు ఋక్ష రాజా! వానరరాజైన సుగ్రీవుని, యువరా జైన అంగదుని కుశలసమాచారమును అడుగక, భగవంతుడైన శ్రీరామచంద్రుని, శ్రీ రామానుజుని కుశలసమాచారమును కూడా అడుగక పవనాత్మజుడైన ఆంజనేయుని క్షేమము అడుగుచు ఆతనిపై అధికమైన ప్రేమను కనబరచుచున్నావు. ఇందులకు కారణమేమి అని ప్రశ్నించెను.
No comments:
Post a Comment