ఇట్లా ఆలోచించుకొనుచు ఇంద్రునిసమానమైన తేజస్సు కలవాడు, ఉత్తమములైన ఆయుధములను ధరించినవాడు, దివ్యభూషణములచే అలంకృతుడు, కవచమును ధరించినవాడైన విభీషణుడు తన నలుగురుమంత్రులతో సముద్రమును దాటి ఆవలి తీరమును చేరెను. పర్వతము వలె భాసించుచు వచ్చుచున్న విభిషణుని గాంచి వానరులు రావణుని దూత అనుకొనిరి. వానరవీరులు ఈ విషయమును సుగ్రీవునకు విన్నవించిరి. అపుడు వానరరాజైన సుగ్రీవుడు భగవంతుడైన శ్రీరామచంద్రునితో వినయపూర్వకముగా "ప్రభూ! రావణుని సోదరుడైన విభీషణుడు నిన్ను దర్శించుటకు వచ్చుచున్నాడు.” అని పలికెను. అపుడు శ్రీరాముడు కిష్కింధాధిపతితో “స్నేహితుడు ఈ విషయములో నీ అభిప్రాయమును చెప్పు” మనెను.
నీతినిపుణుడైన సుగ్రీవుడు "ప్రభూ! రాక్షసులు మిగుల మాయావులు. వారిలో అంతర్థానమైన శక్తి కూడా కలదందురు. శూరుడు, వీరుడునైన విభీషణుడు అత్యంత క్రూరుడైన రావణుని సోదరుడు, కావున వీనిని మంత్రులతో పాటు వధించుట ఉచితమని పల్కెను.
సుగ్రీవుని వచనములను ఆలకింపగానే శ్రీ పవనకుమారుడు వ్యాకులుడయ్యెను. తనకు సన్నిహితులైన వారలను శ్రీరామచంద్రుని చరణారవిందములకు చేర్చి సంతుష్టుడగుట శ్రీఆంజనేయుని సహజస్వభావము. లంకలో విభీషణుడు ఆంజనేయునకు పరిచయమయ్యెను. వాని నిశ్చలమైన భక్తికి ప్రభావితుడయ్యెను. సీతా దేవి జాడను అతడే శ్రీహనుమంతునకు చెప్పెను. రావణువిసభలో శ్రీ ఆంజనేయునిపక్షమున వాదించెను. తన సర్వస్వమును త్యజించి శ్రీరామచంద్రుని చరణముల చెంతకు వచ్చెను. అట్టి పరిస్థితిలో వానరరాజు విభీషణుని విషయమై కటువుగా పల్కుట శ్రీ ఆంజనేయునకు అనర్థముగా తోచెను. పవన కుమారుడు శరణాగతవత్సలుడైన శ్రీ రాముని ఆదేశము కొఱకై నిరీక్షించుచుండెను.
No comments:
Post a Comment