శ్రీగోవర్ధన పర్వతము పరమానంద భరితుడయ్యెను. వాని నేత్రముల నుండి ప్రేమాశ్రుధారలు స్రవించెను. అతడత్యంతవినయపూర్వకముగా శ్రీరామభక్తుడగు ఆంజనేయునితో ఇట్లుపల్కెను. “పవనాత్మజా! నీవు ఒనరించిన ఈ మహోపకారమునకు ప్రత్యుపకారము చేయగలస్థితి నాకు లేదు; కావున నేను సదా నీకు ఋణపడియండెదను.”
యుగయుగములనుండి శ్రీగోవర్ధనపర్వతము సకలజనులచే పూజింపబడుచుండెను. విరక్తులగు మహాత్ములు, భక్తులు, శ్రద్ధాభక్తి సమన్వితులై శ్రీగోవర్ధనగిరికి ప్రదక్షిణము లొనరించి తమతమ అభీష్టసిద్ధులను పొందుచున్నారు. పరమ భాగ్యవంతుడైన శ్రీగోవర్ధనపర్వతమునకు ఇట్టి అత్యున్నతపదమును ఆ భగవంతుడు తన భక్తుడైన శ్రీ ఆంజనేయుని వచనమును సత్యం ఒనరించుటకు ప్రసాదించెను. ఆ శ్రీరామచంద్రుడే ద్వాపరయుగములో శ్రీకృష్ణుడై శ్రీ గోవర్ధన పర్వతమును అనుగ్రహించెను.
శ్రీ ఆంజనేయుని అనుగ్రహమును, దర్శనమును పొందిన భాగ్యవంతునకు శ్రీరామచంద్రుని దర్శనము లభించుట నిశ్చయముగా జరుగును, కరుణామూర్తియైన శ్రీపవనకుమారుడు తన భక్తులను ప్రభువు చెంతకు చేర్చనిదే విశ్రమింపడు. అత్యంత ప్రేమపూర్వకముగా గోవర్ధనగిరిని అనుగ్రహించిన వాడై ఆంజనేయుడు శ్రీరామచంద్రుని చరణారవిందముల చెంతకు చేరెను.
విశాలసముద్రముపై నూఱుయోజనముల పొడవు, పది యోజనముల వెడల్పు కలిగిన సేతువును నిర్మించుట పూర్తియ్యెను. లీలావినోదియైన శ్రీరామచంద్రుడు ఆశ్చర్యచకితుడై ఈ పర్వతశిలలు సాగరజలముపై ఎట్లు తేలియాడుచున్నవని ప్రశ్నించెను; అందులకు వానరులు విన వినయపూర్వకముగా 'శ్రీరామప్రభో! ఇది అంతయు శ్రీరామనామమహిమ; నీ నామమహిమచే పర్వతములు, శిలలు మొదలగునవన్నియు సముద్రముపై తేలియాడుచున్న’ వని పలికిరి.
No comments:
Post a Comment