ఆంజనేయుడు జలాశయమును చేరి కపటముని చెప్పినట్లుగా జలములను త్రాగడం ఆరంభించెను. మహామాయావి ఘోరరూపిణియైన ఒక మొసలి ఆంజనేయుని పాదములను పట్టుకొనెను. నేత్రములను తెరచి తనను మ్రింగుటకు ప్రయత్నించుచున్న మకరిని గాంచి ఆంజనేయుడు కోపించి దాని ముఖమును చీల్చివేసెను. ఆ మకరి మరణించెను.
మకరి శరీరములో నుండి ఒక దివ్యరూపధారిణియైన స్త్రీ బయల్వెడలి ఆకాశమున నిలచి ఆంజనేయుని అనేక విధముల స్తుతించి ఇట్లుపల్కెను. “కపీశ్వరా! నా పేరు ధాన్యమాలి. నేను శాపగ్రస్తురాలనైన ఒక అప్సరసను. అనఘా! నేడు నీకృపా విశేషముచే నేను శాపవిముక్తురాలనైతిని. పతితపావనా ! ఆశ్రమము కృత్రిమము. ముని వేషములో కాలనేమి అనే అసురుడు రావణుని ఆదేశానుసారముగా శ్రీ రామ కార్యమున విఘ్నములను ఒనరించుటకు ప్రయత్నించుచున్నాడు. దేవా! ఆ దుష్టుని సంహరింపుము. శ్రీఘ్రమే ద్రోణాచలమును చేరుము, పావనమైన నీ సంస్పర్శనముచే నేను కృతార్థురాలనై దివ్య లోకములకు పోవుచున్నాను, అనుజ్ఞనిమ్ము.
ఇట్లు పల్కి ధాన్యమాలి అదృశ్యమయ్యెను. ఆంజనేయుడు కాలనేమి కడకు వెళ్ళగా మానవరూపములో నున్న అసురడు ఇట్లుపల్కెను. “వానరశ్రేష్ఠుడా! రమ్ము. నేనిపుడు మంత్రదీక్షను ఇచ్చెదను.” మంత్రిదీక్షా నెపముతో ఒక పెద్ద కార్యక్రమమును కల్పించి ఆంజనేయుని మాటలలో బెట్టి రాత్రి అంతయు గడుపవలయునిని అసురుడు ఆలోచించెను.
“ఋషివరా! మొదట దక్షిణను స్వీకరింపుము" అనిన ఆంజనేయుని వచనములను విని కపటజటాధారి ఆశ్చర్యచకితుడయ్యెను. వాడు ఆశ్చర్యములో నుండి తేరుకొను లోపలే పవనకుమారుడు వానిని తన వాలముతో బంధించి గగనమున కెత్తి భూమి పైగొట్టెను. అసురుడు శ్రీరామనామమును అచ్చరించుచు శిథిలశరీరమును వీడి సద్గతిని పొందెను. ఆహా ! భక్తుల ఆగ్రహము కూడ మానవుని ఉద్ధరింపగలదు. అయినచో అనుగ్రహమెంత ఉపకారం ఒనరింపగలదో గదా!
No comments:
Post a Comment